ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు

 వారి ఆకాంక్షలను గౌరవించడం ముఖ్యం

వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు
న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనం సాక్షి)  : రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించకుంటే మట్టి కరచిపోతాయని గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఎన్టీఆర్‌ లాంటి వారు కడా ప్రజాగ్రహంలో కొట్టుకు పోయారు. ఎపిలో జగన్‌ ప్రభుత్వం విపక్షాలను అణచివేయడం, కేసులు పెట్టడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. తాను పుట్టి పెరిగిన పార్టీలను అణగదొక్కడంలో కెసిఆర్‌ ఎలాంటి వెనకడుగు వేయలేదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణలో ఉనికి లేకుండా పోవాలని కెసిఆర్‌ వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఆయన దెబ్బకు టిడిపి ఉనికిలేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్‌ ఇప్పుడు అదే దారిలో ఉంది. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను,ఆకాంక్షలను పట్టించు కోలేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేసారు. కానీ అక్కడా మమతా బెనర్జీ లాంటి వారు పుట్టుకుని వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా అదే ధోరణిలో నిరంకుశ పాలన సాగించడంతో ఇప్పుడు మమతా బెనర్జీ పునాదులు కూడా కదులు తున్నాయి. బిజెపి అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ఉన్న మమతా బెనర్జీ బిజెపి నేతలపై దాడులకు దిగుతోంది. గత ఎన్నికల్లో గెలిచినా బిజెపి కూడా బలంగానే తన ఉనికిని చాటింది. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ సిఎం చేతుల్లో ఉంటుంది. ఓ జాతీయ నాయకుడు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకుండా అదంతా వారి సృష్టేనని చెప్పడం ద్వారా అహంకారన్ని ప్రదర్శించారు. ఇక తెలంగాణల కూడా తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్‌, ఇప్పుడు బీజేపీ రూపంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందిన ఊహించి ఉండకపోవచ్చు. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్‌ అదే తప్పు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో బలంగా ఉన్న వామపక్షాలను మమతా బెనర్జీ బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. గ్రేటర్‌లో గత ఎన్నికలలో కేవలం పది శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ తాజా ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ కంటే అధికంగా ఓట్లు సాధించింది. అసెంబ్లీలో ఒక్క సీటు కాస్తా మూడుకు పెరిగింది. బీజేపీ ఇంతలా బలం పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల తరఫున ఎవరైనా ఏ ఎన్నికల్లోనైనా గెలిస్తే వారిని తమ పార్టీలోకి కలిపేసుకుంటూ వచ్చిన కేసీఆర్‌ బీజేపీకి చెందిన వారిని మాత్రం ఆకర్షించలేకపోయారు. అలాగే వారికి పునాదే లేదన్న ధోరణి ప్రదర్శించారు. కానీ ప్రజల్లో నిరసనలు నివురుగప్పితే నాయకుడు ఏ పార్టీలో అయినా పుట్టుకుని వస్తారని గమనించలేదు. ఈ కారణంగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి బీజేపీనే కనిపిస్తున్నది. కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. మోదీ,అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ గతంలో అద్వానీ,వాజ్‌పేయిల ఆధ్వర్యంలో ఉన్న బిజెపికి భిన్నం. తెలంగాణ బిజెపిలో ఇప్పుడు నాయకత్వం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దూకుడు పెంచి టీఆర్‌ఎస్‌ను తమ ఉచ్చులోకి లాగారు. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం విఫలమైంది. అలాగే టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రజాస్వా మ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా అంతా తామే అన్నట్టుగా కెసిఆర్‌, కెటిఆర్‌ వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రగతిభవన్‌ ఛాయలకు ఎవరు రాకుండా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలకు కూడా పర్మిషన్‌ ఉండాల్సిందే. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉందన్న ఆరోపణలు పెరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విూడియానుదూరం పెట్టారు. కేసీఆర్‌ చిన్నపాటి విమర్శను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు. ఫలితంగా ప్రజల మనోభావాలను కేసీఆర్‌కు తెలియజేయడానికి పార్టీలో కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడిరది. తెలంగాణ ప్రయోజనాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్‌ మొత్తంగా తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించి పనిచేస్తున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. యధారాజా తథా ప్రజా అన్నట్లు కేసీఆర్‌ నియంతృత్వానికి అలవాటుపడిన మంత్రులు, శాసన సభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌ రెడ్డి, ముత్తిరెడ్డిల భూ కబ్జాలు ఇందుకు ఉదాహరణలుగా చూడాలి. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితఏ ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. అందుకు ఒడిషా
సిఎం నవీన్‌ పట్నాయక్‌ ఉదాహరణగా చూడాలి. ఇటీవల తమిళనాడులో కూడా స్టాలిన్‌ ఇదే కోవలో ప్రజలకు చేరువ అవుతున్నారు.