సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

 


72గంటల సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

కేంద్ర ప్రైవీటీకరణ విధానంపై నేతల మండిపాటు

సమ్మెతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ ఏకతాటి పైకొచ్చి కేంద్రంలోని బీజేపీ పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఇచ్చిన 72 గంటల పిలుపు మేరకు గురువారం తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఆందోళనలు చేపట్టారు. బొగ్గు గనుల వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మెలో  టీబీజీకేఎస్‌, ఏఐటియుసి, ఐఎన్‌ టీయూసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 72 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న సింగరేణిలో సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గనులపై పోలీసులు భారీగా మొహరించారు. కార్మికులందరూ విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. ఓపెన్‌ కాస్ట్‌ ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని జే వి ఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌, కిష్టారం ఓపెన్‌ కాస్ట్‌లలోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. రెండు ఓపెన్‌ కాస్ట్‌లకు సంబంధించి సుమారు 750 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక్కరోజు కార్మిక సమ్మెలో సుమారు 25 వేల నుండి 30 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. జేవిఆర్‌ ఓసి పి 3, కోయగూడెం ఓసి పి3, శ్రావణ పల్లి ఓసి పి, కేకే 6మైన్‌ ల కొరకు ఓపెన్‌ టెండర్లను పిలవడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి 72 గంటల పాటు సింగరేణిలో సమ్మె చేపట్టారు. సింగరేణిని  ప్రైవేటీకరణను నిరసిస్తూ  మూడు రోజులు సమ్మెకు పిలుపునివ్వటంతో భూపాలపల్లి  సింగరేణి కార్మికుల సమ్మె దిగారు. కార్మికులు విధులకు హాజరు కాక్‌ పోవటం తో గనుల పై  నిర్మానుష్యంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు బ్లాకులను ప్రవేటు పరం చేయడం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల రానున్న రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లిలోనూ సింగరేణి కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. బొగ్గు గనుల వేలన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఇవాళ్టి నుండి మూడు రోజుల సమ్మె ప్రారంభించారు. ఫలితంగా రామగుండం రీజీయన్‌ లోని ఆరు భూగర్బ గనులు, నాలుగు ఓపెన్‌ కాస్ట్‌ లలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. కార్మికులు లేక బోసిపోతున్నాయి బొగ్గు గనులు. మరో వైపు సమ్మెను విజయవంతం చేయాలంటు? బొగ్గుగనుల పై  కార్మిక సంఘాల బైక్‌ ర్యాలీ చేపట్టాయి.