ప్లాస్టిక్‌ రహిత నగరంగా కృషి చేద్దాం

ప్రజలకు విషెస్‌ చెప్పిన మేయర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): ప్లాస్టిక్‌ రహిత పట్టణాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన చేయాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. కొత్త ఏడాది ప్రజలు కరోనా నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య పనులకు ప్రజల సహకారం తోడయితే విజయం సాధించగలమన్నారు. కొత్త ఏడాది అంతా ప్లాస్టక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రజలను ఆమె కోరారు. ప్లాస్టిక్‌ నిజజీవితంలో మనతో మమేకమైనా దానిని దూరం చేయకుంటే ఎన్నో అనర్థాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ జనపనార సంచులు ఉపయోగించేలా చూడాలన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాడకాన్ని తగ్గించగలిగామని అన్నారు.