ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మోడీ నిర్ణయాలు

  

కార్పోరేట్లకు ఊడిగం చేసే యత్నాలకు పెద్దపీట

ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నారాయణ

విజయవాడ,డిసెంబర్‌11((జనంసాక్షి) ): ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పాటుపడాలనే విషయంపై రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు స్పష్టతనిచ్చినా ... వాటి అమలులోపమే అసలు సమస్య అని సిపిఐ నేత నారాయణ అన్నారు. అనేకానేక సమస్యలను ప్రజల కోణంలోనే చూడాలన్నారు. అప్పుడే సమస్యలకు చెక్‌ పెట్టగలమన్నారు. కానీ పాలకలు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేవలం కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయని నారాయణ ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల రైతుల ఉద్యమాలతోనే సాగుచట్టాలను రద్దు చేశారని అన్నారు. అలాగే అమరావతికోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కూడా తక్కువ చేస్తే నష్టపోయేది జగన్‌ మాత్రమే అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు అడ్డంకులు సృష్టించాలన్నారు. జగన్‌ కూడా పాదయాత్ర చేయలేదా అని అన్నారు. ఆనాడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకన్నారు. వైసిపి రాజధాని విషయంలో తప్పటడుగులు వేసిందన్నారు. ఇకపోతే రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడుదశాబ్దాల్లో పేదరికం పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, అంతరాలు పెరిగిపోవడం అందోళనకరమైన విషయమే. కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నమైన పోకడలు పెరిగిపోతున్నాయి. దేశాన్ని సంఘటితంగా ఉంచుతున్న రాజ్యాంగ పునాదులైన ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదంపైనే దాడులు, కుట్రలు జరుగుతున్నాయి. ఆదేశిక సూత్రాలకు భిన్నంగా సంక్షేమ రాజ్యం భావన నుండి కేంద్ర ప్రభుత్వం వేగంగా తప్పుకుంటూ, ప్రైవేటు పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్‌లకు ఎర్ర తివాచీ పరిచి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, దేశ సంపదను కట్టబెడుతున్నది. దీంతో ధనవంతులు మరింత సొమ్ముచేసుకొని ప్రపంచ కుబేరులవుతున్నారే తప్ప దేశంలో సమస్యలకు పరిష్కారం దక్కడం లేదు. బడా పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నేర చరిత్ర కలిగిన వారు ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నూటికి 90 శాతం ఈ వర్గాలే. ప్రజాసేవకులు కనుమరుగవుతున్న దుస్థితి. అందుకే పాలకులు ప్రజలను చులకనగా చూస్తున్నారన్నారు. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగ లక్ష్యానికి  భిన్నంగా నేడు డబ్బు, మద్యం, చీరలు, ఇతరత్రా సామాన్లు  లాంటివి ఇచ్చి ఓటరును ప్రలోభాలకు గురిచేసి అర్ధబలం, అంగబలంతో అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టకుండా చిన్నచిన్న సంక్షేమ పథకాలను ఎరవేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేటి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలు ఎరచూపి ప్రజలపైన పెత్తనం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. చమురు, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. మోడి ప్రభుత్వం విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చి ప్రజలను చీకట్లోకి నెట్టివేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు బ్యాంకులకు బకాయిపడ్డ వేల కోట్ల రూపాయలను మాఫీచేసి, మరోపక్క ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నది. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉన్న శతకోటీశ్వర్ల సంపద 2009లో 11 శాతం ఉండగా, 2019 నాటికి 21 శాతానికి పెరిగింది. అత్యధిక పేదరికం భారతదేశంలోనే ఉండగా, మరోవైపు కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే. పేదరికాన్ని తగ్గించడంకన్నా ప్రపంచస్థాయి కోటేశ్వరులను తయారు చేయడానికి మోడీ ఎక్కువ మక్కువ చూపుతు న్నారనినారాయణ మండిపడ్డారు.  రైతుకు గిట్టుబాటు ధర అందడం లేదు. చేతివృత్తుల వారికి ఉపాధి కరువైంది. దేశం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లో కూరుకుని పోయాయి. ప్రభుత్వాలు అప్పులలో, ప్రజలు పేదరికంలో వుండటానికి ప్రధాన కారణం పాలకుల మోసపూరిత వాగ్దానాలకు అద్దం పడుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తోన్న ఈ ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని అన్నారు.  నేరచరితగల నాయకులు తాము చేసిన నేరాల నుండి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్పొరేట్‌ శక్తులు కీలుబొమ్మలుగా మార్చుకొని పెత్తనం చెలాయిస్తున్నాయని, దీనిని అరికట్టకుంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదన్నారు.