` విన్నపాలు ముగిసాయి
` పోరాటమే మిగిలింది
` తెలంగాణ చేనేతకు కేంద్రం మొండిచేయి
` మండిపడ్డ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబరు 10(జనంసాక్షి): చేనేత పరిశ్రమను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేటీఆర్ విూడియాతో మాట్లాడారు.రాబోయే కేంద్ర బడ్జెట్‌లో క్లస్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు. గత ఏడున్నరేండ్లుగా నేత కార్మికుల కోసం రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్ లూం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉలుకుపలుకు లేదన్నారు. 26 బ్లాక్ లెవల్ క్లస్టర్ ఏర్పాటు కోసం వినతులిస్తే చేసింది నామమాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. కేంద్రం కూడా సహకరించాలి.. కేంద్రం సహకరించకపోతే ఊరుకోమని చెప్పారు. పీఎం మిత్రలో చేర్చి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ చేనేత కార్మికుల జీవన విధానం గతం కంటే మెరుగ్గా ఉంది. 2016`17 నుండి చేనేత చేయూత, రుణ మాఫీ, మరమగ్గాల ఆధునీకరణ చేయడంతో పాటు ప్రభుత్వం నుండి నేరుగా ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల కోసం యూనిఫాం, ఎన్నో ప్రభుత్వ పరమైన ఆర్డర్లు ఇచ్చామన్నారు. కార్మికుడిని యజమానిని చేసే విధంగా వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టామన్నారు.
చేనేతకు చేయూత ఏదీ?