వరిచేలు నీటముగనడంతో అనుకోని నష్టం
ఆందోళనలో అన్నదాతలు
విజయవాడ,డిసెంబర్3 (జనంసాక్షి) : ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు దక్కుతాయని రైతులు ఆశపడ్డారు. పంట కంకిదశలో ఉన్నప్పటి నుంచి వర్షాలు మొదలవటం, పాలుపోసుకునే దశలోనే మానుకాయ వేయటంతో కొంత దిగుబడిపై ప్రభావం పడితే, మిగిలిన పంటపై వర్షాలు, వాయుగుండాలు కోలుకోని నష్టాన్ని మిగిలిచ్చాయి. దీంతో ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి కూడా దక్కటం గగనమైపోయింది. ఎకరాకు 38 బస్తాల సగటు దిగుబడి వస్తుందని అనుకుంటే, 5.73 లక్షల ఎకరాల్లో 2.17 కోట్ల బస్తాల ధాన్యం దిగుబడి దక్కేది. ఏ ఆటుపోట్లు లేకుంటే ఇది మరింత పెరిగేదికూడా. అయితే ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో దిగుబడులు సగానికిపైగా పడిపోవటంతో ఎకరాకు సగటున 20 బస్తాల దిగుబడికూడా అంతంతమాత్రంగా ఉంది. పంట నీటిలో నానటం వల్ల బంగారు వర్ణాన్ని కోల్పోయి నల్లగా మారిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావటంలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మాత్రం కొనుగోలు విషయంలో ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాల్వలకు ఎగవున ఉన్న మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుం డూరు, రేప్లలె ప్రాంతాల్లోని భూముల్లో వరి పంట చివరి దశలో చేతికంది వచ్చింది. వరుస వాయుగుండాలతో పంట మొత్తం నేలవాలిపోయింది. అయితే వీటిలో చాలావరకు కంకులు నేలపై వాలిపోయి, వాన నీటిలో నానిపోయి మొలకలొచ్చేశాయి. మిగిలిన తాజాగా కో`ఆపరేటివ్ శాఖ అధికారులు కొంతమంది సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. సాధారణంగా ఎకరా వరి పండిరచటానికి రూ.25వేల నుంచి రూ.28వేల వరకు పెట్టుబడులు అవుతాయి. ఈ సారి వర్షాల వల్ల దెబ్బతిన్న పంటకు మ రింత పెట్టుబడులు పెరిగిపోయాయి. దీంతో సగటు పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలకు పెరిగింది. వరి నారుమళ్లు, నాట్లు, ఎరువులు, పురుగు మందులకు ఇప్పటివరకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడులు పెట్టేశారు. అయితే వరి కోతలు కూలీలతో అయితే గతేడాది ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటే, ఈ సంవత్సరం ప్రాంరభంలోనే వరి కోతలకు రూ.7 వేలు చెబుతున్నారు. పోయిన పంటకు అంత ఖర్చులు ఎక్కడ పెడతామని వదిలేస్తున్నామ ని ప్రభాకరరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అదే హార్వెస్టర్ అయితే గతేడాది గంటకు రూ.3వేల వంతున చెల్లించామని, పడిపోయిన చేలకు గంటన్నర నుంచి 2 గంటలు పట్టిందని, ఎకరాకు రూ.4,500 నుంచి రూ.6వేలతో అయిపోయిందని, అయితే ప్రస్తుతం నీరు చేలల్లో ఉండటం, చాలావరకు తడితో ఉండటంతో కోయించలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. కోతకే ఇంత రేటు పెడితే, రేపు కుప్ప, నూర్పి ళ్ల కు రెట్టింపు ఖర్చవుతుందని, అవన్నీ భరించే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వానికి మాత్రం దీనిపై చీమకుట్టినట్టు కూడా లేకపోవటం, ఉన్న ధాన్యాన్నయినా మంచి ధరకు కొనుగోలు చేయటం లేదు. ఈ సంవత్సరం వాయుగుండాలతో నష్టం పెరిగిపోయి సగానికి సగం దిగుబడు లు తగ్గిపోవటంతో కనీసం ఖర్చులు కూడా రావనేది రైతుల ఆవేదన. ఈ మాత్రం పెంపునకే భారీగా పెంచా మన్నట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుపడాల్సి విషయమంటూ రైతు సంఘం నాయకులు విమర్శించారు.