ఓయూలో గ్రీన్‌ చాలెంజ్‌

మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన టిఆర్‌ఎస్‌వి నేతలు

హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) : 

రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్‌ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కడారి స్వామియాదవ్‌ మాట్లాడుతూ కామన్‌ మ్యాన్‌ నుంచి కార్పొరేట్‌ మ్యాన్‌ వరకు అందరినీ గ్రీన్‌ చాలెంజ్‌లో భాగస్వామ్యం చేసిన వ్యక్తి సంతోష్‌కుమార్‌ అని కొనియడారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఇప్పటి వరకు 18 కోట్ల మొక్కలు నాటారని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రభుత్వాలు విరివిగా మొక్కలు నాటాలని సూచించిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ఒక బాధ్యత గల ఎంపీగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ అనే కార్యక్రమానికి సంతోష్‌కుమార్‌ రూపకల్పన చేశారని చెప్పారు. ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి మరో ముగ్గురిని మొక్కలు నాటేందుకు చాలెంజ్‌ విసిరేలా కార్యక్రమం ప్రారంభించారని వివరించారు. ఈ చాలెంజ్‌లో భాగంగా ఇప్పటికి ఎంతో మంది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారని, వారిలో అన్ని స్థాయిలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని పేర్కొన్నారు.