జర్నలిస్టు ముసుగులో ఉన్న బిజెపి కార్యకర్త
రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు కుట్ర పన్నాడు
మండిపడ్డ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్,డిసెంబర్8 జనం సాక్షి : తీన్మార్ మల్లన్నగా పిలువబడుతున్న చింతపండు నవీన్ కుమార్ యాంకర్ మాత్రమే, జర్నలిస్టు కానే కాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆయన ఏ పత్రికలో కానీ, ఛానల్ లో కూడా రిపోర్టర్‌గా పని చేసిన దాఖలాలు లేవన్నారు. సంఘంలో జర్నలిస్టుకు ఒక హోదా, గుర్తింపు ఉన్నందున.. సంఫ్‌ు పరివార్‌కు చెందిన ఆయన జర్నలిస్టు ముసుగేసుకుని బీజేపీ కోసం పని చేశాడని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఇతను బీజేపీ మద్దతుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను బద్నాం చేస్తూ..రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చే పనిలో నిమగ్నమయ్యాడని వివరించారు. నవీన్ తనకు తాను అతిగా అంచనా వేసుకుని, పగటి కలలుకంటున్నారని వ్యాఖ్యానించారు.బెదిరింపులు,బ్లాక్ మెయిళ్లకు పాల్పడి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీకృష్ణ జన్మస్థానంలో రెండు నెలలు ఊచలు లెక్కపెట్టినా కూడా ఆయనలో మార్పు రాకపోవడం..ఎలుక తోలు తెచ్చి ఏన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు అన్న చందనా ఆయన వైఖరుందన్నారు. ఆయన వ్యవహారాన్ని, మాటల్ని మంత్రి తీవ్రంగా ఖండిరచారు. అరాచక, నిరంకుశ పాలనకు, వారసత్వ రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా ఉందని కొప్పుల పేర్కొన్నారు. బాబ్రీమసీదును కూల్చి, గోధ్రాలో ముస్లింలు, ఎస్సీలను ఊచకోత కోసి అరాచకానికి పాల్పడినది బీజేపీ కాదా?అని మంత్రి నిలదీశారు. బీజేపీ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నదని మోదీ పాలనను మంత్రి దుయ్యబట్టారు. ఇటీవల నియమితులైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్రాచారి, సుభప్రద్ పటేల్ ఉద్యమకారులు కాదా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెద్ద వాళ్లను తిట్టడం,హేళన చేయడం మానుకుని సంస్కారంతో మెలగాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పని తీన్మార్ మల్లన్నకు మంత్రి కొప్పుల హితవు పలికారు.