స్థానిక ఎన్నికల విజయంపై మంత్రి తలసాని
హైదరాబాద్,డిసెంబర్14 (జనంసాక్షి ) : తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ వన్ సైడ్ విజయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెలిచే అవకాశం లేక పోయినా ప్రతిపక్షాలు పోటీ చేశాయన్నారు. ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టన్నారు. తెలంగాణలో అభివృద్ధి పథకాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. హుజూరాబాద్‌లో ఓడిపోతే ఏదో జరిగిపోయిందని మాట్లాడారని, ఈ ఎన్నికల ఫలితాలు చూసి ప్రతిపక్షాలు ఏం చెప్తాయన్నారు. ప్రజలు గులాబీ జెండా మాది అని చెప్తున్నారని తలసాని వ్యాఖ్యానించారు. సంఖ్యాబలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎన్నో కుట్రలు చేసి ఏదో ఒకటి గెలవాలని ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే కేసీఆరే తమ నాయకుడని అందరూ ఓటు వేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవుపలికారు. డబ్బుల ద్వారా కొనాలని చూశారని... కానీ వారి ఆటలు సాగలేదని దానం నాగేందర్ అన్నారు.
ఎన్నిక ఏదైనా విజయం టిఆర్‌ఎస్‌దే