ఉల్లితో పాటు ఎగబాకిన కూరగాయల ధరలు

 


టమాటాలది కూడా అదేదారి

ఆందోళనలో సామాన్య ప్రజలు
హైదరాబాద్‌,డిసెంబర్‌8 (జనం సాక్షి): ఉల్లిధలరు ఆకాశాన్ని అంటుతున్నా దీనిని పండిస్తున్న రైతులకు మాత్రం పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్లో మొన్నటి వరకు 60 రూపాయల వరకు ఎగబాకిన ధరలు ఇప్పుడు 45`50 మధ్య స్థిరంగా సాగుతున్నాయి. టామాటాలు కూడా గతంలో ఎఊప్పుడ లేనంతగా ఉన్నాయి. దీంతో సామాన్యులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వ్యాపార మాయాజాలంలో ధరలు తగ్గాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా ఉల్లి సాగయ్యే కర్నూలు మార్కెట్‌లో కొన్ని రోజుల క్రితం కిలో రూ.2`3 కూడా రైతుకు పడలేదు. రవాణా ఖర్చులూ దక్కక రోడ్లపై పారబోశారు. ఉల్లి సాగుకు పెట్టింది పేరు కర్నూలు అని అందరికీ తెలిసిందే. ఏపీలో పండిరచే ఉల్లిపాయల్లో అక్కడ 80 శాతం పైన పండుతాయి. అనంతపురం, కడపలోనూ కొంత మేర ఉల్లి సాగవుతోంది. నిరుడు బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల రేట్లు పెరిగాయంటూ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలో 87 వేల ఎకరాల్లో ఉల్లిని సాగు చేయిస్తామని బీరాలు పలికింది. సాధారణ సాగు విస్తీర్ణం 67 వేల ఎకరాలు. కొన్నేళ్లుగా ధరల్లేక నష్టాలపాలవుతున్న రైతులు ఈ ఏడాది ఉల్లిసాగును బాగా తగ్గించారు. రైతుల నిరాసక్తతకు వర్షాభావం తోడై ఎన్నడూ లేని విధంగా సాగు 35 వేల ఎకరాలకు పడిపోయింది. అదే ముందటేడు 80 వేల ఎకరాల్లో, నిరుడు 72 వేల ఎకరాల్లో ఉల్లి సాగైంది. పోనీ సాగైన మేరకన్నా పంట బాగుందా అదీ లేదు. అకాలవర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. కుళ్లిపోయింది. నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలు దిగ్గోశారు. వాతావరణ పరిస్థితులు ప్రభుత్వానికి తెలియకేంకాదు. మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలు అప్రమత్తమై మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని ఉంటే ప్రజలకు కాస్త ధరలు తగ్గేవి. ఇక నిత్యం వాడే కూరగాయల ధరలు కూడా కనీసం కిలోకి 60కి తక్కువగా లేవు. పావు కావాలంటే 15 రూపాయలకు తక్కువగా లేదు. క్యారెట్‌ ఏకంగా 140 కిలోకు చేరింది. గతంలో ఏడాదిలో కొన్ని రోజులే కూరగాయల ధరలు జనాన్ని బాధించేవి. ఇప్పుడు సీజనూ లేదు అన్‌ సీజనూ లేదు. అన్ని రోజులూ ధరల మోతే. మే నుంచి ఆగస్టు మధ్య సాధారణంగా కూరగాయలకు అన్‌ సీజన్‌. ఆ సమయంలో రైతులు సాగు చేపట్టడం వలన ఉత్పత్తి తగ్గి డిమాండ్‌ పెరిగేది. మామూలు రోజుల్లో కంటే అప్పుడు కూరగాయల రేట్లు కొంచెం పెరిగేవి. అదేంటో మూడు నాలుగేళ్ల నుంచి ఏడాది పొడవునా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోపక్క అ టమాటా పరిస్థితీ అంతే. కర్నూలు, మదనపల్లె మార్కెట్‌లలో కిలోకు రూపాయి కూడా పడక టమాటాలను ట్రాక్టర్లతో తొక్కించారు. అదే వినియోగ దారులకు రూ.40కి అమ్ముతున్నారు. కొన్ని రోజులైతే రూ.60`80 అమ్మారు. కిలో రూ.10`20కి దొరికే క్యారెట్‌ రూ. వంద అయింది. బీట్‌రూట్‌ సైతం రూ.40`50 పలుకుతోంది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏ రోజు ఏ కాయగూర ధర ఏ స్థాయికి ఎగబాకుతుందోనన్న
భయం సగటు ప్రజలను వెంటాడుతోంది. ఇంతకుముందు జేబులో డబ్బులు తీసికెళ్లి సంచిలో కూరగాయా లు తెచ్చేవారు. ఈ కలికాలంలో సంచిలో డబ్బులు తీసికెళ్లి జేబులో కూరగాయలు తెచ్చు కోవాల్సిన దుర్గతి. ఉద్యానవన పంటలు పెంచేటట్లయితే కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? రైతులకు బ్యాంక్‌ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా సాగు పెంచుతామంటే కుదిరేపనేనా? ఈ సంవత్సరం ఉల్లి సాగు దిగజారడంపై గుణపాఠాలు నేర్చుకోవాలి. నిత్యం అవసరమయ్యే కూరగాయల విషయంలో పంటలు పండిరచేలా రైతులను ప్రోత్సహించాలి.