త్యాగానికి బాట వేసిన ఏసు ప్రభువు

ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన జగన్‌

అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్నారు.. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం,త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని సిఎం జగన్‌ గుర్తుచేసారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం? ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.క్రిస్మస్‌ సందర్భంగా అందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.