బర్త్‌డే పార్టీలో స్నేహితుల గొడవ

స్నేహితుడి తలపై బీరుబాటిళ్లతో మోదడంతో గాయాలు

హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్‌ డే పార్టీలో గొడవ రాజుకుంది. జన్మదిన వేడుకలలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి పై దాడికి దారి తీసింది. ఈ సంఘటన జగద్గిరి గుట్ట పోలీస్ట్సేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎలమ్మబండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్‌ చెరువు కట్ట కింద సెలబ్రేట్‌ చేసుకున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ వేడుకల్లో మద్యం సేవించిన వారంతా గొడవకు దిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరగటంతో సాయి రెడ్డి అనే యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. బీరు బాటిళ్లను సాయి రెడ్డి తలపై పగులగొట్టారు.దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సాయిరెడ్డిని చికిత్స నిమిత్తం కెపిహెచ్‌ బి లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.