ప్రలోభాలుపెట్టే వారిని నమ్మొద్దు
పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణం
సంక్షేమంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ
సికింద్రాబాద్‌లో డబుల్ ఇళ్ల కాలనీని ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్,డిసెబర్17 (జనంసాక్షి): లంచాలు తీసుకుని డబుల్ ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్దిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడిరచారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. భారత దేశంలో నిర్మించిన మొత్తం ఇండ్లు ఒకెత్తు అయితే.. మన రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు మరో ఎత్తు అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లాంటి పథకం 28 రాష్టాల్ల్రో ఎక్కడా లేదన్నారు. రూ. 1800 కోట్ల రూపాయలతో డబల్ బెడ్ రూం ఇండ్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఇల్లు రూ. 45 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు. భారత దేశంలోని 28 రాష్టాల్లో ఇల్లు కోసం ఎంత ఖర్చు చేశారో.. తెలంగాణలో డబల్ బెడ్ రూం ఇండ్ల కోసం అంత కంటే ఎక్కువ ఖర్చు చేశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన అన్నా రు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం
ఇప్పటి వరకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇక్కడ ఇల్లు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు దొరకని వారికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామన్నారు కేటీఆర్. ఇండ్ల కేటాయింపులన్నీ లాటరీ పద్దతిలోనే ఇస్తామన్నారు. డబ్బులు ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి ఉచితంగా ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు.