అంగన్‌వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచాం


నేతచీరలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీలకు గత ఏడేళ్లలో మూడుసార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్త్రీ` శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అంగన్‌వాడీలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి మంత్రి నేత చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం తన వాటాగా ఇస్తుంటే..కేంద్రం పావులా వంతు మాత్రమే ఇస్తుందన్నారు. అంతే కాకుండా కోవిడ్‌ సమయంలో తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా అద్భుత సేవలు అందించినందుకు వారిని కొవిడ్‌ వారియర్స్‌ గా గుర్తించాలని సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో కేంద్రాన్ని స్వయంగా తాను కోరడం వల్లే నేడు దేశ వ్యాప్తంగా అంగన్‌వాడీలకు 50 లక్షల రూపాయల బీమా వర్తించింది అని చెప్పారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అంగన్‌వాడీలకు నేత చీరలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 67,411 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలుకు చీరలు ఇస్తున్నామన్నారు. గిరిజన
ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బలామృతంతో కూడిన పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలను సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే వాటిని ప్రజలకు సరిగా చేరవేసే మంచి మనసుతో పని చేయాలని అంగన్‌వాడీ లకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, లెనినా, అధికారులు సీతా మహాలక్ష్మి, డెబోరా, ఉష, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.