విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి అంటూ పుకార్లు
విజయనగరం,డిసెంబర్7 (జనంసాక్షి) : జిల్లాలో ఒమిక్రాన్ కేసు తేలినట్లు పుకార్లు వ్యాపించడంతో కలకలం రేగింది. శృంగవరపుకోటలో ఒమిక్రాన్ కేసు బయటపడినట్లు ప్రజలు చెప్తుండటంతో జిల్లా వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముక్కుకు మాస్క్ ధరించడమే కాకుండా నిర్ణీత భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రజలు సూచిస్తున్నారు. అలాగే, ఒమిక్రాన్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో ఒమిక్రాన్ కలకలం రేగింది. ఐర్యాండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిలో ఒమిక్రాన్ తేలిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోకుండానే సదరు వ్యక్తి తిరుపతికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి నేరుగా శృంగవరపుకోటలోని తన అత్తగారింటికి చేరినట్లు అధికారులు తెల్సుకున్నారు. కాగా, ముంబై విమానాశ్రయం అధికారుల సమాచారం మేరకు సదరు వ్యక్తికి కొవిడ్ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. అయితే, సదరు వ్యక్తిలో ఒమిక్రాన్‌కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని వైద్యులు స్పష్టం చేశారు.