వందేండ్లు పూర్తి చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌

పంజాబ్‌లో అంబరాన్నంటిన సంబరాలు

న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): శిరోమణి అకాలీదళ్‌ పంజాబ్‌కు చెందిన బలమైన రాజకీయ పార్టీ. వందేండ్ల క్రితం మత సంస్థకు టాస్క్‌ఫోర్స్‌గా ప్రారంభమై అంచెలంచెలుగా విస్తరిస్తూ చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించే స్థాయికి ఎదిగింది. బీజేపీతో కలిసి రాష్ట్రంలో ఒక పర్యాయం అధికారం కూడా చేపట్టింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ తర్వాత రెండో పురాతన పార్టీ శిరోమణి అకాలీదళ్‌ పార్టీయే. ఈ పార్టీని 1920 డిసెంబర్‌ 14న సిక్కుమత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీకి టాస్క్‌ఫోర్స్‌గా స్థాపించారు. పార్టీ మొదటి అధ్యక్షుడు సర్ముఖ్‌ సింగ్‌ చుబ్బల్‌. అయితే మాస్టర్‌ తారాసింగ్‌ నేతృత్వంలో ఈ పార్టీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పార్టీని స్థాపించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి కావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా వందేండ్ల పండుగ జరుపు కున్నారు. ఈ వందేండ్ల పండుగ ఎప్పటికీ గుర్తుండేలా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు శిరోమణి అకాలీదళ్‌ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ శిరోమణి అధ్యక్షుడిగా ఉన్నారు.