ప్రభంజనంలా సాగిన అమరావతి యాత్ర

 

రైతు సంకల్పానికి ప్రజల జేజేలు
పాలకులకు కనువిప్పు కలిగిస్తే అదే మేలు
తిరుపతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఢల్లీి రైతుల ఉద్యమం తరహాలోనే ఎపిలో అమరవతి రైతుల ఉద్యమం ప్రభంజనలా సాగుతోంది. మహిళలు వెన్నంటి రావడం ఈ ఉద్యమంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారికి ఎన్నో సమస్యలు ఎదురయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. రాజధాని అమరావతిని కొనసాగిం చాలని రైతులు చేపట్టిన పాదయాత్ర అలిపిరి వద్ద ముగిసినా సంకల్పం మాత్రం అలాగే ఉండిపోయింది. మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకం కారణంగా భూములు ఇచ్చిన
రైతులు ఆందోళనలకు దిగారు. ఈ యాత్రతో ప్రభుత్వం నిజాలు తెలుసుకుంటే మంచింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం అన్న నినాదంతో సాగిన యాత్ర ప్రజల్లో కూడా కదలిక తెచ్చింది. అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రభంజనంలా సాగి మంగళవారం సాయంత్రం శ్రీవారి పాదాలచెంత తిరుపతిలోని అలిపిరిలో ముగిసింది. తుళ్లూరు నుంచీ గత నెల 1వ తేదీన ప్రారంభమైన పాదయాత్రకు అశేష ప్రజాదరణ లభించింది. తిరుపతి నగరంలో వేలాదిగా జనం పోటెత్తి వారిని అభినందించారు. అమరావతీ నినాదంతో నగర వీధులన్నీ మార్మోగాయి. అలిపిరి చేరుకున్న అమరావతి రైతులు శ్రీవారికి టెంకాయలు కొట్టి పాదయాత్రకు ముగింపు పలకడంతో పాటు తమ ఉద్యమం మరింత ముందుకు తీసుకుని పోతామన్న సంకల్పాన్ని ప్రకటించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాదయాత్ర మొదటి మెట్టు మాత్రమేనని శాసనసభలో అమరావతే ఏకైక రాజధానంటూ ప్రభుత్వం ప్రకటించేదాకా తమ ఉద్యమం కొనసాగుతుం దంటూ పాదయాత్ర నిర్వాహకులు ప్రకటించారు. చివరి రోజు జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన ప్రజలు పాదయాత్రకు బ్రహ్మాండమైన స్వాగతం పలకడంతో వారిలో మరింత ఉత్సాహం రెట్టించినట్లు అయ్యింది. ప్రజలతో పాటు పలుపార్టీల నాయకులు వారితో కలసి పాదయాత్రకు మద్దతు ప్రకటించి రైతులతో పాటు నడిచారు. పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులకు శాలువాలు కప్పి శ్రీవారి ప్రసాదాలు అందజేసి సంఫీుభావం ప్రకటించారు. గుమ్మడి కాయలు పగులగొట్టి పాదయాత్ర బృందానికి దిష్టి తీసి స్వాగతం పలికారు. ఈ యాత్రలో మహిళలు కూడా కష్టాలను లెక్కచేయకుండా ముందుకు సాగడం విశేషం. అడుగడుగునా ఆంక్షలను లెక్కచేయకుండా మహోద్యమంగా సాగిన తీరు రైతుల్లో భరోసా నింపిందనే చెప్పాలి. ముఖ్యంగా అమరావతీ రక్షక గోవిందా అన్న సరికొత్త నామస్మరణతో పాదయాత్ర బృందం స్వామివారిని స్తుతించింది. మరోవైపు వారితో పాటు వెన్నంటి వచ్చిన సామాన్య ప్రజలు సైతం పెద్దఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. దీంతో రథం ముందు కొబ్బరికాయలు పోగుపడ్డాయి. పలువురు శ్రీవారి పాదాల మండపంలోకి వెళ్ళి కూడా శ్రీవారికి కొబ్బరి కాయలు కొట్టారు. ఇంతటితో పాదయాత్ర ముగిసినా రాజధాని ఉద్యమం మాత్రం ఆగదని, ఇది తొలి మెట్టు మాత్రమేనని ప్రతినిధులు ప్రకటించారు. ఈ ప్రభంజనంతో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అమరావతి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. అధికారం శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రజలతో కలసి ఉన్నామన్న సంకేతం ఇవ్వాలి. ప్రకటనలతో మభ్యపెట్టే ప్రయత్నాలకు ఇక స్వస్తి పలకాలి.