అమరావతి పేరుతో చంద్రబాబుది దొంగయాత్ర

అది పక్కా రాజకీయ యాత్రమాత్రమే

టిడిపిపై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : టీడీపీ అధినేత చంద్రబాబు దొంగచాటుగా నిర్వహిస్తున్న యాత్రే అమరావతి రైతుల యాత్ర అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే అన్ని నియోజకవర్గాల విూదుగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్రగా మారిందని తెలిపారు. సోమిరెడ్డి వల్లే సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకి చోటు దొరకలేదని ఆరోపించారు. సోమిరెడ్డికి ఉండే పరపతి ఏమిటో రైతులే అర్ధం చేసుకోవాలని అన్నారు. సోమిరెడ్డి టెంట్‌ వేయిస్తే... అందరూ తీసేయండి.. తీసేయండి... అన్నారని తెలిపారు. యాత్రని అడ్డుకోవాలని తాము భావిస్తే, అస్సలు యాత్రే చేయలేరని, ఎక్కడికక్కడే అడ్డుకుని ఉండేవారమన్నారు. ఆడపడుచులంటే తమకు గౌరవమని చెప్పారు. అందరి అభిమతాలని గౌరవిస్తామన్నారు. మద్దతివ్వలేదని అడ్డంకులు సృష్టిస్తున్నామంటూ ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. అమరావతి రైతులది ఒక్క ప్రాంతానికి సంబంధించిన యాత్ర అని  కాకాని గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. సమగ్రాభివృద్ధి తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. రైతు యాత్రని రాజకీయ యాత్రగా మార్చారని, అమరావతి రైతులను అడ్డు పెట్టుకొని టీడీపీ యాత్ర చేస్తోందని మండిపడ్డారు. పాదయాత్రలు చేసేవారు న్యాయస్థానం ఆదేశాలు పాటించాలన్నారు. కావాలని ఉద్రిక్తలు సృష్టించడం సరికాదన్నారు. కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు తుంగలో తొక్కి పాదయాత్రలా అని ప్రశ్నించారు. అమరావతి యాత్రల్లో శనిలా సోమిరెడ్డి ప్రవేశించాడని, అందుకే వాళ్ళకి కష్టాలు ప్రారంభం అయ్యాయని దుయ్యబట్టారు. సోమిరెడ్డి చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము  వసతి కల్పించకుండా అడ్డుకొన్నట్టు ఆధారాలుంటే చూపాలని డిమాండ్‌ చేశారు.