నిర్లక్ష్యం వహిస్తే థర్డ్‌వేవ్‌ తప్పదు

  

 


` కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు
` ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు
` నిపుణుల హెచ్చరిక
న్యూఢల్లీి,డిసెంబరు 12(జనంసాక్షి):ఒమిక్రాన్‌.. కరోనా కొత్త వేరియంట్‌. ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ఇప్పటి వరకు కనీసం 59 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ 36 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వేరియంటే దేశంలో థర్డ్‌ వేవ్‌కు కారణమా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ స్పందించారు. మహమ్మారి ఇంకా అంతం కాలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని, ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ కొద్దికాలంలోనే ప్రపంచమంతా వ్యాపించడం చూస్తుంటే దీని ప్రభావం తీవ్రస్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.అయితే, కొత్త వేరియంట్‌ ఎలాంటి లక్షణాలు కలిగిస్తుంది? ఇన్ఫెక్షన్‌ తీవ్రత, విస్తరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ప్రపంచ దేశాలు సహకరించాలని పూనమ్‌ ఖేత్రపాల్‌ పిలుపునిచ్చారు. అన్ని దేశాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని సూచించారు. ‘మహమ్మారి ఇంకా చుట్టూ ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు, కొత్త వేరియంట్ల ఆవిర్భావం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ప్రమాదం ఎక్కువ ఉంది’ అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అందిన సమాచారం మేరకు.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ద్వారా రీఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయని తెలిపారు.డెల్టా వేరియంట్‌ కంటే తక్కువ స్థాయిలోనే లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే దీనిపై ఎలాంటి అంచనాలకు రాలేమని స్పష్టం చేశారు. దక్షిణాసియా ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిఘా, ప్రజారోగ్యం, సామాజిక చర్యలను బలోపేతం చేయడం కొనసాగించాలని, టీకా కవరేజీని వేగంగా పెంచాలని సూచించారు. ఒమిక్రాన్‌ కారణంగా భారత్‌లో థర్డ్‌ వేవ్‌ వస్తుందా? అనే అంశంపై కొంత అనిశ్చితి ఉందని తెలిపారు. భారత్‌లో కొద్ది రోజుల్లోనే ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు భారత్‌లో 36 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.