అందరు మెచ్చిన నేత దివంగత రోశయ్య

ఆయన నిరాడంబర జీవితం నేటితరానికి స్ఫూర్తి

సంస్మరణ సభలో నివాళి అర్పించిన నేతలు
రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అందరూ గౌరవించే విధంగా నగరం నడిబొడ్డున రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటరల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రోశయ్యకు స్ముతివనం నిర్మించేం దుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ముఖ్యమంత్రులకు ఏమాత్రం తీసిపోని నాయకుడు రోశయ్య అని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ నేత... గాంధీ కుటుంబానికి పీతిపాత్రుడైన రోశయ్య మరణం గురించి సోనియా గాంధీ తన నుంచి వివరాలు అడిగి తీసుకున్నారన్నారు. రోశయ్య సూచనతోనే సమస్యలపై మాట్లాడే ముందు అవగాహన చేసుకుని మాట్లాడుతున్నానని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జానారెడ్డి...రోశయ్యతో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కౌన్సిల్‌లో రోశయ్య వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రిగా ఇబ్బంది పడ్డానన్నారు. 1983లో మండలిలో గంటల పాటు రోశయ్య తనపై ప్రశ్నల పరంపర కొనసాగించారని గుర్తుచేశారు. ఆఖరకు రోశయ్య తనను అభినందించి.. ఆశీర్వదించారన్నారు. నూతన రాజకీయ నేతలకు రోశయ్య జీవితం ఆదర్శమని తెలిపారు. క్యాబినెట్‌లో రోశయ్యతో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జానారెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేయకుండా రోశయ్యను కొందరు వేధించారని అన్నారు. రోశయ్య తన ఆవేదనను నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొద్దని రోశయ్యతో చెప్పానన్నారు. రోశయ్య రాజకీయాల్లో అజాతశత్రువని వీహెచ్‌ పేర్కొన్నారు. తెలుగు నిండుతనానికి రోశయ్య నిదర్శనమని కాంగ్రెస్‌ నేత టీ.సుబ్బరామిరెడ్డి అన్నారు. రోశయ్య సంస్మరణ
సభలో టీ.సుబ్బరామి పాల్గొని ప్రసంగించారు. అధికారంతో అహంకారం రావటం ఈరోజుల్లో సాధారణంగా మారిందన్నారు. మరణించినా జీవించి ఉండేది కొందరే అని తెలిపారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రోశయ్య తరుచూ అంటూ ఉండేవారన్నారు. కాంగ్రెస్‌లో అందరి ముఖ్యమంత్రులను మెప్పించిన నేత రోశయ్య మాత్రమే అని సుబ్బరామిరెడ్డి చెప్పుకొచ్చారు. రెండు తెలుగు ప్రభుత్వాలు రోశయ్యను తగిన రీతిలో గౌరవించాలని, రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలోని ప్రతి మండలాన్ని సందర్శించిన ఏకైక నాయకుడు రోశయ్య మాత్రమేనని కొనియాడారు. ఆర్థికశాఖపై పెటెంట్‌ హక్కు రోశయ్యది మాత్రమేనన్నారు. సంయమనం.. సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలనేది నేటితరం రోశయ్య నుంచి నేర్చుకోవాలన్నారు. కొత్త నాయకులు రోశయ్య ప్రసంగాల నుంచి స్పూర్తి పొందాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం రోశయ్య కేబినెట్‌లో తాను ఎందుకు లేనో కేవీపీ రామచందర్‌ రావుకి మాత్రమే తెలుసని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేయలేకపోయానన్న బాధ ఇప్పటికీ తనను కలిచివేస్తోందని ఆయన పేర్కొన్నారు. దాదాపు సీఎంలు అందరి దగ్గరా తాను మంత్రిగా పనిచేశానని జేసీ తెలిపారు. దివంగత మాజీ సీఎం రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నానని కేవీపీ రామచంద్రరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైకమాండ్‌ ఆదేశంతో సందేహించకుండా సీఎం పదవికి రాజీనామా చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతనే రోశయ్య ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నార న్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణవార్త ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చినప్పుడు రోశయ్య మనో వేదనకు గురయ్యారని అన్నారు. రోశయ్య సమర్థత విూద నమ్మకంతో వైఎస్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వైఎస్‌ జిల్లాల పర్యటనకు వెళ్తే.. ఏ కొత్త పథకం హావిూ ఇస్తారనే భయం రోశయ్యలో ఉండేదని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ప్రసంగాలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ అన్నారు. అసెంబ్లీలో రోశయ్య లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మంత్రులే అదనంగా శ్రమించాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన అభిప్రాయాన్ని పక్కకు పెట్టి వాస్తవాలను నిక్కచ్చిగా అధిష్టానానికి చెప్పారని ఆయన పేర్కొన్నారు. రోశయ్య మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు.