లాన్స్‌నాయక్‌ సాయితేజ కుటుంబానికి అండ


50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎపి ప్రభుత్వం

నేరుగా కుటుంబ సభ్యులకు అప్పగించే యోచన

అమరావతి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్‌ లాన్స్‌ నాయక్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చాపర్‌ క్రాష్‌లో చనిపోయిన సాయితేజ కుటంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ సీఎంఓ అధికారులు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలువనుంది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం జగన్‌ గురువారమే అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. సైనికుడి మరణానికి వెలకట్టామనే భావన రాకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. కష్టంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థికసహాయం చేస్తున్నామంటూ హడావిడి చేయొద్దన్న సీఎం.. దీనిపై విూడియాలో ఎలాంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబాన్ని నేరుగా కలవాలన్న ముఖ్యమంత్రి.. సీనియర్‌ మంత్రిని పంపి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి, అక్కడే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈనెల 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్‌ రావత్‌ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ ఈ ప్రమాదంలో మరణించాడు. అతని భౌతికకాయం బెంగుళూరు ద్వారా స్వగ్రామం ఎగువరేగడికి తీసుకురానున్నారు. భౌతికకాయం రావడం ఆలస్యమైతే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయితేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్‌ రావత్‌ను సైతం మెప్పించారు. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ.. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కు పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవాడు. హెలికాప్టర్‌ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాయి. దాంతో కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో పోల్చి.. మృతదేహాలను గుర్తించారు. శనివారం ఉదయం సాయితేజ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆయన మృతదేహానికి అధికారిక లాంఛనాలతో ఆదివారం రోజున అంత్యక్రియలు పూర్తి చేయాలని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు.