ట్రబుల్‌ షూటర్‌కు ట్రబుల్స్‌

మంత్రి హరీష్‌ రావుపై మండిపడ్డ జగ్గారెడ్డి

సంగారెడ్డి,డిసెంబర్‌10 జనంసాక్షి:

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మలా పోటీలో ఉండటంతో ట్రబుల్‌  షూటర్‌ హరీష్‌ రావు జిల్లాలో ట్రబుల్స్‌లో వున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్‌లో ఓటు హక్కును ఆయన  వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఎన్నికలలో పెట్టడంతో స్థానిక నేతలను సొంత అల్లుడ్లుగా, సొంత బిడ్డలుగా హరీష్‌రావు చూసుకున్నారన్నారు. నైతికంగా ఉమ్మడి మెదక్‌ జిలాల్లో కాంగ్రెస్‌ పార్టీదే విజయమన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ క్యాంప్‌లు పెట్టలేదన్నారు. టీఆరెస్‌ పార్టీ అధికారంలో ఉండి, 700 పైచిలుకు ఓట్లు ఉండి కూడా క్యాంప్‌ పెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. ఏకగ్రీవం కావొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డిని బరిలో నిలిపామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 230తో పాటు మరో 170 ఓట్లు తమకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇక ఆపై ఏమైనా ఉంటే అది దైవ నిర్ణయమని ఆయన జోస్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.