బట్లర్‌ అసమాన పోరాటం

 
ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించ పెట్టిన బట్లర్‌
అడిల్కెడ్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): ఓటమివైపు పయనిస్తున్న జట్టును ఎలాగైనా కాపాడాలనే కసితో ఎంతో పట్టుదలగా ఆడుతున్న ఆటగాడు కీలక సమయంలో ఇలా ఔటైతేనే కాస్త బాధగా ఉంటుంది. అలాంటిది.. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌లో ఇంకా ముఖ్యమైన డే/నైట్‌ టెస్టులో జట్టును ఓటమిభారం నుంచి తప్పించడానికి చివరి రోజు 200కు పైగా బంతులు ఎదుర్కొని టెయిలెండర్లతో కలిసి పోరాడుతుంటే.. అనుకోకుండా ఆ బ్యాట్స్‌మన్‌ కాలు వికెట్‌కు తాకి బెయిల్స్‌ ఎగిరిపడితే ఎలా ఉంటుంది? అది ఊహించుకుంటేనే.. అయ్యో అని జాలేస్తుంది. అచ్చం ఇదే జరిగింది ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌కు.అడిలైడ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ సోమవారం ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసేసరికి 82/4తో నిలిచింది. చివరి రోజు గెలవాలంటే 386 పరుగులు సాధించాలి. మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే రోజంతా బ్యాటింగ్‌ చేయాలి. ఇలాంటి స్థితిలో సోమవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌.. చివరికి 192 పరుగులకు ఆలౌటైంది. అయితే, తొలి సెషన్‌లో ఆట ప్రారంభమైన కాసేపటికే బెన్‌ స్టోక్స్‌ (12), ఓలీపోప్‌ (4) ఔటవ్వగా ఇక ఇంగ్లాండ్‌ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బట్లర్‌ (26బీ 207 బంతుల్లో 2%ఞ%4) టెయిలెండర్లతో కలిసి అసమాన పోరాటం చేశాడు. వన్డేల్లో 118, టీ20ల్లో 141 స్ట్రైక్‌రేట్‌ కలిగిన అతడు ఎంతో సహనంతో బ్యాటింగ్‌ చేశాడు. క్రిస్‌వోక్స్‌ (44బీ 97 బంతుల్లో 7%ఞ%4)తో కలిసి ఏడో వికెట్‌కు ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పరుగుల గురించి ఆలోచించకుండా ఓవర్ల మీద ఓవర్లు ఆడేస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. బట్లర్‌, వోక్స్‌ ఏడో వికెట్‌కు 31.2 ఓవర్లలో 66 పరుగులు జోడిరచారు. దీంతో ఆస్ట్రేలియా విజయంపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, వోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా రిచర్డ్‌సన్‌ మ్యాచ్‌ను ఆసీస్‌వైపు మళ్లించాడు. తర్వాత రాబిన్సన్‌ (8బీ 39 బంతుల్లో 1ఐ4) క్రీజులోకి వచ్చి బట్లర్‌కు కాసేపు సహకరించాడు. టీ విరామానికి ఇంగ్లాండ్‌ 180/8 స్కోర్‌తో నిలిచింది. ఇక చివరి సెషన్‌లోనూ అంతే దృఢ సంకల్పంతో ఆడుతున్న బట్లర్‌ కాసేపటికే నిష్క్రమించాడు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో అతడు బ్యాక్‌ఫుట్‌పై ఆఫ్‌సైడ్‌ షాట్‌ ఆడేక్రమంలో వికెట్లకు షూ తాకింది. దీంతో బెయిల్స్‌ కిందపడ్డాయి. ఈ విషయాన్ని గమనించని బట్లర్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించగా దగ్గరలోనే ఫీల్డింగ్‌ చేస్తున్న ఆసీస్‌ ఆటగాళ్లు వికెట్లను చూసి సంబరాలు చేసుకున్నారు. ఎలాగైనా మ్యాచ్‌ను కాపాడాలనే విశ్వ ప్రయత్నం చేసిన ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ చివరికి ఇలా వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత అండర్సన్‌ కూడా ఔటవ్వడంతో ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది.