కొత్త జిల్లాలు ఏర్పడ్డా జడ్పీలు మాత్రం యధాతథం

మళ్లీ ఎన్నికల వరకు పాత జడ్పీల పాలనే

తెలంగాణ మాదిరే కొనసాగించే ఆలోచన

అమరావతి,జనవరి27(జనం సాక్షి):  జిల్లాల విభజనకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినప్పటికీ, అది జిల్లా ప్రజా పరిషత్‌లపై ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. రెవెన్యూపరమైన అంశాల ప్రాతిపదికనే జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జెడ్‌పి పాలకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా పాలకవర్గాలు ఏర్పాటవుతాయా, లేదా అనే అంశంపై రాజకీయ నాయకులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అయితే జడ్పీలను ఇప్పట్లో విభజించే అవకాశం లేదని అంటున్నారు. జిల్లాలతోపాటు జెడ్‌పి పాలకవర్గాల్లోనూ మార్పు జరుగుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న వేళ పరోక్షంగగా ఇదే సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, అక్టోబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్‌పి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లసహా పాలకవర్గాలు ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పంచాయతీరాజ్‌ నిపుణులు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత జిల్లాలు లేదా మండలాల విభజన జరిగితే, ఆయా జిల్లాల్లో పాతపాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలకు పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే తొమ్మిది జిల్లా పరిషత్‌లకు 2013లో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. టిఆర్‌ఎస్‌ పార్టీ కొత్త జిల్లాల హావిూతోనే ఎన్నికలకు వెళ్లింది. కొత్త ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో 31 జిల్లాలకు ప్రాథమికంగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. వాటిపై నెల రోజులపాటు అభ్యంతరాల స్వీకరించిన అనంతరం, అదే ఏడాది అక్టోబర్‌ నుంచి ఆ జిల్లాల్లో పరిపాలన ప్రారంభించింది. 31 జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, తొమ్మిది జిల్లా పరిషత్‌లనే కొనసాగించారు. వాటి పదవీకాలం పూర్తయిన తర్వాత, కొత్త జిల్లాల వారీగా జెడ్‌పిటిసి, ఎంపిటిసిలకు ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రంలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రజా పరిషత్‌ పాలకవర్గాలకు ఎలాంటి ఢోకా ఉండదని, పదవీకాలం పూర్తయ్యేంత వరకు అవి కొనసాగుతాయనిచెప్పారు. తెలంగాణలో 2016లో జిల్లాల సంఖ్య 31కు చేరినా, పాత జిల్లాల పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే, కొత్త జిల్లాలకు 2018లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు జరిగాయని ఆయన తెలిపారు.  జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలు (డిసిఎంఎస్‌) కూడా పాతవే కొనసాగనున్నాయి. తెలంగాణలో పరిపాలనాపరంగా 33 జిల్లాలు ఉన్నప్పటికీ, డిసిసిబి, డిసిఎంఎస్‌లు మాత్రం పాత జిల్లాల వారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లోనూ ప్రస్తుతం 13 జిల్లాల్లో ఉన్న డిసిసిబి, డిసిఎంఎస్‌లే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి కేంద్ర ఆమోదం పొందాల్సిందే. తెలంగాణలో పది జిల్లాలను 33గా విభజించినప్పటికీ, కేందప్రభుత్వ గెజిట్‌ ప్రకారం పది జిల్లాలే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆ జిల్లాలకే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పది జిల్లాలకే ఎన్నికల పరిశీలకులను పంపించింది. ఇదే విధానం రాష్ట్రంలోనూ అమలవుతుందని పంచాయతీరాజ్‌ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు కూడా పాత జిల్లాల వారీగానే నిధులు మంజూరవుతాయని తెలిపారు.