కెసిఆర్‌ డైరెక్షన్‌లోనే బిజెపిపై దాడులు

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు

హెచ్చరించిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌
కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని.. కేసులు, జైలు అంటే భాజపా భయపడదని స్పష్టం చేశారు. కొంత మంది పోలీసుల వైఖరి సరిగ్గా లేదని.. వారు పద్ధతి మార్చుకుని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకే భాజపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కేసీఆర్‌ గ్రహించాలని అన్నారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త నాగేశ్వరరావు పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి చేయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభద్రతాభావానికి లోనవుతున్నారనడానికి ఈ దాడులే నిదర్శనమని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలను పక్కన పెట్టి.. కొంత మంది పోలీసులు.. ముఖ్యమంత్రికి కొమ్ములు కాస్తున్నారని విమర్శించారు. అక్రమంగా మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. కొందరు పోలీసులు కేసీఆర్‌కు కొమ్ము కాస్తున్నారు. నేను పోలీసులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. కేసీఆర్‌ను విమర్శించినా జైలుకు పంపిస్తామని బెదిరించడం సరికాదు. తెలంగాణ ఉద్యమ నేతలంతా భాజపాలోకి వస్తున్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో.. కేసీఆర్‌ ఆ లక్ష్యాన్ని పక్కనపెట్టారు. అందుకే ఉద్యమ నాయకులంతా భాజపాలో చేరుతున్నారని అన్నారు.