తెలంగాణ,ఆంధ్రా సీఎస్‌లతో హోంశాఖ భేటి

`


విభజన వివాదాలపై కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకోవాలి

` తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌
హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సవిూక్ష ముగిసింది. దిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వర్చువల్‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సవిూర్‌ శర్మ, సోమేష్‌ కుమార్‌లతో విభజన అంశాల వివాదంపై చర్చించారు. విభజన వివాదాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పలు కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. కేసులు ఉపసంహరించుకుంటేనే తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని తెలిపింది. తొమ్మిదో షెడ్యూల్‌లోని డెక్కన్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 5వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సీఎస్‌ తెలిపారు. ఏపీ ఆర్థిక సంఘం.. ఏపీఎస్‌ఎఫ్‌కి చెందిన రూ.200 కోట్ల వివాదంపై కూడా కోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఫిర్యాదు చేశారు. పదో షెడ్యూల్‌లోని విద్యాసంస్థల విభజనలోనూ కేంద్రం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లిందన్నారు. డిస్కంల నుంచి రూ.3,442 కోట్లు రావాల్సి ఉందని ఏపీ చెబుతోందని, అయితే ఆరాష్ట్రం రూ.12,111 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వివరించారు. విద్యుత్‌ వివాదాల పరిష్కారానికి నీరజా మాథూర్‌ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటై ఏడున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ నివేదిక సమర్పించలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది.సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఈఎల్‌ పూర్తిగా తెలంగాణదేనని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. సింగరేణి విషయంలో ఏపీ అభ్యంతరాలపై కేంద్రం జోక్యం చేసుకోవద్దని కోరింది. తెలంగాణకు 51శాతం, కేంద్రానికి 49శాతం వాటా కొనసాగుతుందని సీఎస్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఏకీభవించినట్లు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. దిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ఇరు రాష్ట్రాల కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇరు రాష్ట్రాల ఆర్థిక, ఆర్‌అండ్‌ బీ ముఖ్యకార్యదర్శులు, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లు కమిటీలో ఉండాలన్న తెలంగాణ సూచనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఏకీభవించారు. ఏపీ భవన్‌ విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని అజయ్‌ కుమార్‌ భల్లా తెలిపారు. విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన, బకాయిలపై చర్చ జరిగింది. విభజన చట్టాన్ని సవరించవద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చట్ట సవరణ చేస్తే గందరగోళానికి దారి తీస్తుందని తెలిపింది. ఒకవేళ చట్ట సవరణ అవసరం లేదనకుంటే.. తాము నష్టపోయిన సొమ్ము కేంద్రమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ జెన్‌ కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 6వేల కోట్ల బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరారు. మరోవైపు కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంలో కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ఏపీ కోరింది.