కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పుడే నిరసనలు

మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళనలు

అన్నమయ్య జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యంపైనా నిరసన

విజయవాడ,జనవరి27(జనం సాక్షి):  కొత్త జిల్లాల ఏర్పాటు,రెవెన్యూ డివిజన్లలో మార్పుల ప్రతిపాదనలపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రాజకీయ కోణంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని ఆరోపిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల పెంపు ప్రకియ్ర చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పిన మాటలకు, ప్రకటనకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపిస్తున్నారు. హిందూపురం బదులు పుట్టపర్తిని ఏర్పాటు చేయడంపైనా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో  చిత్తూరు, కడప జిల్లాల్లో నేతలు ఆందోళన బాట పట్టారు. మదనప్లలె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలోమదనప్లలెలో బుధవారం తిరంగా యాత్రను ప్రారంభించారు. మదనప్లలెను కేంద్రంగా ప్రకటించాలని కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నాయి. పాలనా కేంద్రంగా మదనప్లలెకు బ్రిటిష్‌ కాలం నుంచీ ఉన్న నేపథ్యం, భవన వసతి, విద్య, వైద్య సంస్థలు అందుబాటులో ఉండటం వంటి సానుకూలతలతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తుందన్న ఆశాభావం ఇక్కడ ప్రజల్లో ఉండేది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. తిరంగా యాత్ర ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ  మదనప్లలెను జిల్లా కేంద్రంగా ప్రకటించకుంటే కర్ణాటకలో కలిపేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మదనప్లలెకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని ఈ ప్రాంత ప్రజలు సహించబోరని స్పష్టం చేశారు. మదనప్లలెను జిల్లాకేంద్రం గా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే రెండు విడతలుగా 596 రోజులు ఉద్యమాన్ని చేపట్టగా, బుధవారం 597వ రోజున మూడోవిడత ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి ప్రతినిధులు ప్రకటించారు. కాగా, ఎంతో చరిత్ర కలిగిన మదనప్లలెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. మదనప్లలెలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ మదనప్లలెను జిల్లా చేయకుంటే ఇక్కడి ఎమ్మెల్యేలు,ఎంపీలు ప్రజాగ్రహా నికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై అన్నమయ్య ప్రాంతీయులైన రాజంపేట నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను అవమానించే రీతిలో ఆయన జన్మించిన గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటని అన్ని పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. టీడీపీ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రాజంపేటలో అన్నమయ్య విగ్రహం వరకు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య పుట్టిన గడ్డనే జిల్లా కేంద్రం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగి ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య పేరుతో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ తాళ్లపాక గ్రామస్థులు బుధవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు.