హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు, బ్యాచిలర్లు, వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా అయిదు కిలోల వంటగ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆయిల్ కంపెనిలన్నీ తమ డిస్టిబ్యూట్రర్లు, పెట్రోల్ బంకుల ద్వారా వీటిని విక్రయిస్తుండగా, త్వరలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులో తెచ్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహాపయోగం కోసం 14.2 కిలోల, వాణిజ్య అవసరాల కోసం 19 కిలోల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. చిన్న సిలిండర్లు డోర్ డెలివరీ లేనప్పటికీ ఖాళీ సిలిండర్ తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీలు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నుంచి రీఫిల్ చేసి తీసుకునే వెసులుబాటుంది. తాజాగా రేషన్ దుకాణాల్లోకి అందుబాటులోకి వస్తే అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్న గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చమురు సంస్థల వంట గ్యాస్‌ను బట్టి చిన్న సిలిండర్ ధర ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 5 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌తో కూడిన చిన్న సిలిండర్ రూ.528.32కు లభిస్తుందని సమాచారం
త్వరలో అందుబాటులోకి 5కిలోల సిలిండర్