మరోమారు ఎగ్జిబిషన్‌ పునఃప్రారంభం

నెల 25న అధికారికంగా ప్రారంభించే ఛాన్స్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఈ నెల 25న అధికారికంగా పునఃప్రారంభించేందుకు సొసైటీ పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జనవరి 1న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల విూదుగా లాంఛనంగా ప్రారంభమైన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మరుసటి రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా ఉత్తర్వుల మేరకు అర్దాంతరంగా మూసేసిన విషయం తెలిసిందే. తాజాగా కొవిడ్‌ నిబంధనలను సడలించడంతో ఎగ్జిబిషన్‌ నిర్వహణపై సొసైటీ పాలకవర్గం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎలాగైనా ఈ నెల 25న ప్రారంభించి 46 రోజులపాటు ఎగ్జిబిషన్‌ను కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందగానే నుమాయిష్‌ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని సొసైటీ సభ్యుడొకరు తెలిపారు. ఈ సారి 1600 స్టాళ్లతో.. ఈ సారి నుమాయిష్‌ 1,600 స్టాళ్లతో కొనసాగించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ కారణంగా మూసేసినా స్టాళ్లను అలాగే ఉంచారు. అయితే కరోనా ఎప్పుడు తగ్గుతుందో... నుమాయిష్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఆందోళనకు గురైన స్టాళ్ల నిర్వాహకులు దాదాపు 30 శాతం మంది తమ డబ్బులను తిరిగి తీసుకొని వెళ్లిపోయారు. మిగిలిన 70 శాతం స్టాళ్ల నిర్వాహకులు నుమాయిష్‌ ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు వ్యాపారాలు నిర్వహిస్తామని.. ఇచ్చిన అడ్వాన్స్‌ వెనక్కి తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సొసైటీ పాలకవర్గం మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులకు ఎగ్జిబిషన్‌ను తిరిగి ప్రారంభిస్తామని, తమ వస్తువులను తెచ్చుకోవచ్చని ఆహ్వానాలు, ఫోన్‌ మెసేజ్‌లను పంపుతున్నారు.