కెసిఆర్‌ వస్తే వణికి పోవాలా: బండి

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  సీఎం కేసీఆర్‌ వస్తుంటే జనం వణికిపోవాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. కెసిఆర్‌ తాటాకు చప్పుళ్లకు కూడా బిజెపి భయపడదని అన్నారు. సీఎం పర్యటన పేరుతో సామాన్య జనానికి తీవ్రమైన ఇబ్బందులు కలుగ జేస్తున్నారని ఆరోపించారు. అసలు కేసీఆర్‌ ఎలాంటి తప్పు చేయకుంటే అరెస్టులకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఈ అరెస్టులు, దాడులు చూస్తుంటే ... మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా మారిపోవడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్‌ చేసిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బిజెపి కార్యర్తలను ఉఫ్‌మంటామని అనడం అహంకారమని అన్నారు.