కామారెడ్డి ఆస్పత్రికి పెరిగిన తాకిడి

సౌకర్యాలు మెరు పడడంతో ప్రసూతి కేసుల రాక

కెసిఆర్‌ కిట్‌తో గర్భిణులకు భరోసా
కామారెడ్డి,ఫిబ్రవరి10(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాగా మారడంతో జిల్లా కేంద్రంలోని ప్రాంతీయాస్పత్రి
స్థాయిని పెంచి మెరుగైన వైద్యసేవల కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సౌకర్యాలు లేక ప్రసూతి సేవలందడం లేదన్న విమర్శలు ఉన్నా..వాటిని అధిగమించి ప్రస్తుం పరిస్థితులను చక్కదిద్దారు. అయితే నిధులు విడుదల చేస్తే తప్ప సౌకర్యాలు మెరుగు పడవని అంటున్నారు. కెసిఆర్‌ కిట్‌ పథకం ప్రకటించిన
తరవాత ప్రసూతి కేసుల సంఖ్య పెరిగింది. ప్రజలు కూడా ప్రభుత్వాసుపత్రినే ఆశ్రయిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం నాలుగు జిల్లాల కూడలిగా ఉండటంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. రాష్ట్రంలోనే ఇతర ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ రోగులు ఎక్కువగా వస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై ఆయా అంశాలపై
చర్చించింది. ట్రామాకేర్‌ సేవలు, రక్తనిధి కేంద్రం, సదరం శిబిరాల్లో అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ, ఏఆర్‌టీ తదితర సేవలపై ప్రత్యేకంగా సమావేశంలో ప్రస్తావించారు. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఇందుకు అనుగుణంగా నిధులు వెచ్చిస్తే వైద్య సేవలందించేందుకు ఆస్కారం ఉంటుందని ఆస్పత్రి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మెదక్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల రోగుల తాకిడి ఉంది. వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటైన ఆస్పత్రికి గతంతో పోలిస్తే చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు ప్రసూతి వైద్యం ఇక్కడే అందిస్తుండటంతో పరిస్థితి జటిలంగా తయారైంది. వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్నపాటి కేసులను కూడా ప్రాంతీయాస్పత్రికి సిఫారసు చేస్తున్నారు. ఫలితంగా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కామారెడ్డి ప్రాంతీయాస్పత్రిలో ఉన్న ప్రసూతి కేంద్రాన్ని ఇక్కడే ఉంచి మిగతా విభాగాలను వేరేచోటకు తరలిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తేనే పనులు వేగిరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజుకు 10 ప్రసవ కేసులు వస్తుంటాయి. నెలకు 300 వరకు సాధారణ, శస్త్రచికిత్స ప్రసవాలు చేస్తున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకటి, రెండు కేసులు మినహా ప్రసవాలు జరగడం లేదు. వైద్య రంగానికి నిధుల కేటాయింపులకు అధిక నిధులు కేటాయిస్తే తద్వారా మెరుగైన సేవలందించడంలో ఇబ్బందులను అధిగమించే వీలుంటుంది. జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటే స్థానిక వాసులకు మేలు జరుగు తుంది. ఇటీవల జరిగిన అభివృద్ధి సమావేశంలో అనేక విషయాలను చర్చించాం. అధికారుల
ఆదేశాల మేరకు రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యసేవలు అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.