ఎపిలో జాతీయ రాజకీయాలపై అనాసక్తి

 అధికార వైసిపి, టిడిపి అధినేతలు వైముఖ్యం

అమరావతి,ఫిబ్రవరి21జ‌నంసాక్షి: దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు..ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా ఎపిలో మాత్రం ఎక్కడా సందడి కానరావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికి నామమాత్రమే అయినప్పటికీ కేంద్రంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వ సహకారాన్ని అధికార వైసిపి, విపక్ష టిడిపి నేతలు నాయకులు కోరుకుంటున్నారు. కేసుల నుంచి బయటపడటానికి జగన్‌రెడ్డికి కేంద్రం అండ అవసరం. అందుకే ఆయన కేంద్రంతో పోరాడే స్థితిలో లేరు. గత మూడేళ్ల కాలంలో ఎక్కడా ఆయన కేంద్రంతో తగవు పడలేదు. ఏకకాలంలో జగన్‌రెడ్డితో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పోరాడే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. గత ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీపైకి వ్యతిరేకంగా వెళ్లి ప్రస్తుత దుస్థితి కొనితెచ్చు కున్నామని తెలుగుదేశం నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా బీజేపీ అనుకూల, వ్యతిరేక వైఖరి విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి జగన్‌రెడ్డిని వదిలేసి బీజేపీతో యుద్ధం చేయడం వల్ల తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని చంద్రబాబు మదనపడుతున్నట్లు పార్టీ ఆంతరంగికులు చర్చించుకుంటున్నారు. జాతీయ రాజకీయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇక్కడ దెబ్బతినడం చంద్రబాబుకు ఇష్టం లేదు. జగన్‌ పాలసీ కూడా ఇలాగా ఉంది. అందుకే చంద్రబాబు, జగన్‌
ఇద్దరూ జాతీయ రాజకీయాల వైపు చూడడం లేదు. ఇదే కోవలో జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్‌ నిశ్చింతగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎపిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార వైసిపి, విపక్ష టిడిపిల మధ్యపరస్పర ఆరోపణలు వస్తున్నాయి. సీబీఐ ఎట్టకేలకు చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటిస్తూనే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అధఙకారపార్టీ వారు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రఘురామరాజు జగన్‌కు బెయిలు రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై విచారణ సాగుతోంది. మొత్తంగా ఎపిలో రాజకీయనేతలు జాతీయరాజకీయాలపై ఆసక్తిగా లేరనేచెప్పవచ్చు. కాంగ్రెస్‌,కమ్యూనిస్టులు కూడా స్థానిక సమస్యలపైనే ప్రధానంగా పోరాడుతున్నారు.