ఉక్రెయిన్‌ నుంచి వచ్చే విద్యార్థులకు విమాన టిక్కెట్లు

 


సిఎం జగన్‌ ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు
కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
ఢల్లీిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని వెల్లడి
అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఢల్లీి నుంచి సొంత ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమాన టికెట్లు కొనలేని విద్యార్థులకు ఆ ఖర్చు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఏపీ భవన్‌ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది ఎపి విద్యార్థులను మ్యాపింగ్‌ చేశామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్‌ చేసిన వాళ్లతో వాట్సప్‌గ్రూప్‌ ఏర్పాటు చేసి సూచనలిస్తు న్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా ఎపికి చెందిన ముగ్గురే ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని కృష్ణబాబు వివరించారు. ఉక్రెయిన్‌ నుంచి ఎపి విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఎపి ప్రభుత్వం కృష్ణబాబు నేతృత్వంలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా ఆయన శనివారం విూడియాతో మాట్లాడారు. ఢల్లీిలోని ఎయిర్‌పోర్టులో ఎపి భవన్‌ తరుపున హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లద్దని భారతీయులకు సూచనలు వచ్చాయి. సరిహద్దులకు వెళ్లద్దని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఉక్రెయిన్‌లోని ఏడు వర్సిటీల్లో ఎపి విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సవిూపంలోని రొమేనియన్‌ ఎంబసీని సంప్రదిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లోని ప్రవాసాంద్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్‌లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నాం. వీసా స్టాంపింగ్‌ , ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని కృష్ణబాబు అన్నారు.