మార్కెట్ విలువ‌ల పెంపును వాయిదా వేయాలి


-ప్రభుత్వానికి తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ విజ్ఞప్తి


ఖైరతాబాద్ :  ఫిబ్రవరి 03 (జనం సాక్షి) మార్కెట్ విలువ‌ల పెంపును కొన్నాళ్లు వాయిదా వేయాల‌ని తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌లో మొత్తం ఏడు సంఘాలున్నాయన్నారు. గ్రేట‌ర్ సిటీ బిల్డ‌ర్స్, ఈస్ట్ జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, కూక‌ట్‌ప‌ల్లి బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, ఉప్ప‌ల్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, , ప్ర‌గతిన‌గ‌ర్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, గ్రేట‌ర్ వెస్ట్ సిటీ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, సౌత్ జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ లో మొత్తం 900 మందికి పైగా బిల్డ‌ర్లు మా ఫెడ‌రేష‌న్‌లో ఉన్నారన్నారు. వీరిలో చాలామంది నిర్మాణ‌రంగంలో చురుగ్గా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం రియ‌ల్ ఎస్టేట్ ప‌రిశ్ర‌మ‌ను చాలా ప్రోత్స‌హిస్తోందన్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు బాగున్నాయి, విద్యుత్ కోత‌లు లేవన్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం సంఘ వ్య‌తిరేక శ‌క్తుల నుంచి ఎలాంటి భ‌యం, బెదిరింపులు లేకుండా త‌మ వ్యాపారం చేసుకుంటోందన్నారు. మంచి పోలీసింగ్‌, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌ట‌మే అందుకు కార‌ణమన్నారు. ఇక్క‌డి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చూసి ఇత‌ర రాష్ట్రాల నుంచి చాలామంది వ‌చ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్నారన్నారు. ఇక్క‌డ రియ‌ల్ట‌ర్ల‌కు మంచి వ్యాపారం ఉండ‌టం, నిర్మాణ రంగం బాగుండ‌టంతో దేశ‌మంతా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చూస్తుందన్నారు. ప్ర‌స్తుతం మార్కెట్ విలువ స‌వ‌ర‌ణ‌ను 1.2.2022 నుంచి చేప‌ట్ట‌డం నిర్మాణ ప‌రిశ్ర‌మ‌కు, రియ‌ల్ ఎస్టేట్ రంగానికి పెద్ద దెబ్బ‌ అన్నారు. ఇటీవ‌ల  22.7.2021 నుంచే ఒక‌సారి మార్కెట్ విలువ‌ల‌ను స‌వ‌రించారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి మార్కెట్ విలువ‌ల‌ను స‌వ‌రించారన్నారు. స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ‌లు, భ‌వ‌నాల రేట్లు, బెట‌ర్‌మెంట్ రేట్లు, నాలా ఛార్జీల‌ను ఇటీవ‌లే పెంచ‌డం వ‌ల్ల‌, ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్ విలువ‌ల‌ను మ‌ళ్లీ పెంచ‌డం స‌రికాదన్నారు. మార్కెట్ విలువ‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నాలా ఛార్జీల్లాంటివ‌న్నీ 1.2.2022 నుంచి దీంతోపాటు జ‌త‌చేసిన స్టేట్‌మెంటులో చూపించిన‌ట్లు  అమాంతం పెరుగుతాయన్నారు. ఒక‌వేళ మార్కెట్ విలువ‌ల‌ను స‌వ‌రించాల్సి వ‌స్తే, అది స‌రైన ప‌ద్ధ‌తిలో, పార‌ద‌ర్శ‌క విధానంతో, ప‌రిశ్ర‌మ‌ పౌరుల‌ను సంప్ర‌దించి చేయాలన్నారు. మొత్త‌మ్మీద మార్కెట్ విలువ‌ల‌ను 25 శాతం నుంచి 50 శాతం వ‌ర‌కు పెంచ‌డం న్యాయం కాదన్నారు. దీనికి స‌రైన ప‌ద్ధ‌తిని క‌నుగొని, దాన్ని స‌క్ర‌మంగా పాటించి న్యాయ‌బ‌ద్ధ‌మైన మార్కెట్ విలువ క‌నుగొనేవ‌ర‌కు వాయిదా వేయాలన్నారు.