జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్ల సవిూక్ష

విజ్ఞాపనలు పరిశీలించిన ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌

విశాఖపట్టణం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై విశాఖ కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల సవిూక్షా సమావేశం సోమవారం జరిగింది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పాల్గొన్నారు. నాలుగు జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, వినతులపై చర్చించారు. నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణెళిష్‌ రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించేందుకు సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో సవిూక్ష సమావేశం జరిగింది. నాలుగు జిల్లాల్లో ఏర్పాటయ్యే కొత్త జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలను సవిూక్షించారు. అన్ని విజ్ఞాపనలను సవిూక్షించి సహేతుకమైన వాటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ చెప్పారు. రంపచోడవరానికి సంబంధించి పాడేరు కేంద్రంగా ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని, ఇది రాజమండ్రికి దగ్గరగా ఉంటున్నందున దానిని పరిశీలించాలని విజ్ఞాపనలు అందాయని తెలిపారు. పెందుర్తి, ఎస్‌.కోటను విశాఖలోనే ఉంచాలని, నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే విజ్ఞాపన స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణెళిష్‌ నుంచి అందిందని వెల్లడిరచారు. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి మెంటాడను పార్వతీపురంలో కాకుండా విజయనగరంలోనే కొనసాగించాలని సూచన అందిందన్నారు. పార్వతీపురం పేరుతో జిల్లా ఉండాలని కూడా వినతులు అందాయని చెప్పారు. శ్రీకాకుళంలో రాజాంను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వచ్చిందని తెలిపారు.