పుణ్యస్నానాలకు రాజమండ్రి గోదావరి తీరం సిద్దం

ఏర్పాట్లను పర్యవేక్షించన కమిషనర్‌

రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 28( జనం సాక్షి): మహాశివరాత్రికి రాజమహేంద్రవరం గోదావరి ఘాట్‌ల వద్ద స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు.పుష్కరాలరేవు, గౌతమి ఘాట్‌, వీఐపీ ఘాట్‌లను పరిశీలించారు. రేవులకు వచ్చే భక్తులు పూర్తిగా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని, అలసత్వం వహిస్తే అంటువ్యాధులు కూడా ప్రబలే ప్రమాదముం దని అన్నారు. అప్రమత్తంగా వుండాలని సిబ్బందికి సూచించారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా రేవులకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ రేవులోను ప్రజలకు సూచనలు ఇచ్చే పబ్లిక్‌ అడ్రాసింగ్‌ సిస్టమ్‌ ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్పొరే షన్‌, మెడికల్‌, ఫిషరీస్‌, పోలీస్‌, విద్యుత్‌ శాఖల అధికారులతో జాయింట్‌ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఘాట్‌లో పారిశుధ్యం బాగుండాలని, రేవుల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలుగకుండా జాయింట్‌ కంట్రోల్‌ కమిటీ 24గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ అత్యంత కీలకమని చెప్పారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలన్నారు.