మార్చి 4 వరకు 11రోజులపాటు ఉత్సవాలు
నేడు ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణశ్రీశైలం,ఫిబ్రవరి21: శ్రీశైలంలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగ నున్నాయి. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఈవో లవన్న తెలిపారు.
ఆన్‌లైన్‌లో రూ. 500 అతి శీఘ్ర దర్శనం, రూ. 200 శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు. తొలిరోజు 22న ధ్వజారోహణ, 23న స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భృంగివాహన సేవ, 24న హంసవాహన సేవ, 25న మయూర వాహన సేవ, 26న రావణవాహన సేవ, 27న పుష్పపల్లకి సేవ, 28న గజవాహన సేవ, మార్చి 1న నందివాహన సేవ జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1 రాత్రి పది గంటలకు లింగోద్భవకాల మహన్యా సపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12గంటలకు కల్యాణోత్సవ క్రతువును చేపట్టనున్నారు. 2న సాయంత్రం 4.30గంటలకు రథోత్సవం, 8.00 తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. 3న ఉత్సవాలకు పూర్ణాహుతి పలుకుతారు. ఉత్సవాల్లో చివరి
రోజైన మార్చి 4న రాత్రి 7.30గంటలకు అశ్వ వాహన సేవ, 8గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలు ఉంటాయి. సంప్రదాయం ప్రకారం పలు పుణ్యక్షేత్రాల నుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ నెల 22న శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం, 24న విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, 25న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, 26న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాలను సమర్పిస్తారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లుగా భక్తులు పెద్దసంఖ్య లో రాలేకపోయారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు భారీగా రావచ్చని దేవస్థానం అధికారులు భావించి ముందస్తు చర్యలు చేపట్టారు. పాతాళ గంగ వద్ద షవర్లను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మరుగు దొడ్లను అందుబాటులోకి తెచ్చారు. పాదయాత్ర భక్తులకు లోటు రానివ్వ కుండా సౌకర్యాలను కల్పిస్తున్నారు. భక్తులకు మూడు క్యూలైన్ల ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇరుముడి సమర్పించేం దుకు తరలివచ్చే శివస్వాములకు ప్రత్యేక క్యూలైన ఉంచారు. క్షేత్రాన్ని విద్యుత్, పుష్పాలంకరణతో సుందరీకరించారు. ప్రధాన వీధులు, కూడళ్ల వద్ద స్వాగత తోరణాలతో అలంకరించారు. 11రోజులు పాటు సాగే బ్రహ్మోత్సవాలు ఎలాంటి లోపాలు తలెత్తకూడదని ఈవో ఎస్.లవన్న అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తూ అధికారులు నిర్ణయించారు. తొలుత ఈ నెల 21 వరకు స్పర్శదర్శనానికి వెసులుబాటు కల్పించారు. అయితే ఆదివారం స్పర్శదర్శనానికి భక్తులు పోటెత్తారు. రూ.500 చెల్లించి టికెట్లు పొందినప్పటికీ వారికి దర్శనం లేకపోవడంతో భక్తులు అధికారులను నిలదీశారు. భక్తుల రద్దీ పెరగడంతో స్పర్శదర్శనాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. శివస్వాములకు సోమవారం వరకు అవకాశం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల అనంతరం మార్చి 5 నుంచి స్పర్శదర్శనాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.