జగగామ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ నిరంకుశం ఎక్కువ కాలం సాగదన్న ఈటెలమేమేమన్న ఉగ్రవాదులమా అంటూ రాజాసింగ్ ప్రశ్న
హైదరాబాద్,ఫిబ్రవరి10(జనంసాక్షి): హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. అయితే టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జనగామ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని అన్నారు. నిరసనలు, బంద్‌లు చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా అంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు. దాడులు చేసిన వారి పక్షాన పోలీసులు నిలుస్తారా అని నిలదీశారు. ఇది ఎక్కువ కాలం చెల్లదని ఈటల హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులుంటాయని, ఇలా తనను అరెస్టు చేయడం సరికాదని ఈటల రాజేందర్ ఆగ్రహం
వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌కు తలొగ్గారని విమర్శించారు. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం తెలంగాణలో లేదా అని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు, గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామ వెళ్లాలనుకున్నానని.. పోలీసులు తీరు సరిగా లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపి ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికం, మేమేమన్న ఉగ్రవాదులమా?’ అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజాసింగ్ విరుచుకు పడ్డారు. జనగామలో తమ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని.. పోలీసులు వారికి సహకరించారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ నేత బండి సంజయ్ ఆదేశాల మేరకు కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తుంటే .. ప్రభుత్వం తమని అరెస్టు చేయడం ప్రజా స్వామ్యానికి విరుద్ధమని రాజాసింగ్ విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ప్రతిపక్షాలను హౌజ్ అరెస్టు చేయడం కాదు.. త్వరలోనే రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ అరెస్ట్ చేస్తారన్నారు. కేసీఆర్‌కు బీజేపీ ఎమ్యెల్యేలు, ఎంపీలంటే భయం పట్టుకుందని, అందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.