` మందమర్రిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నేతృత్వంలో సామూహిక ‘‘ రణ దీక్ష ‘‘.!
` బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు..!
` అన్ని వర్గాల ప్రజల సంఫీుభావం
` దోస్తుల కోసం మోదీ సింగరేణిని అమ్మాలని చూస్తున్నడు..
` ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగనివ్వం
` రాష్ట్ర ప్రయోజనాలు`సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం దేనికైనా తెగిస్తాం : బాల్క సుమన్
మంచిర్యాల,ఫిబ్రవరి 9(జనంసాక్షి):మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ‘‘బీజేపీ హఠావో...సింగరేణి బచావో ‘‘ ....రణ నినాదం మారుమ్రోగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా కోల్ బెల్ట్ కొలిమై మండిరది. తెలంగాణ మాగాణి... సింగరేణి ని కాపాడుకునేందుకు టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్మిక లోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఇవాళ అన్ని ఏరియాల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా మందమర్రి లో ప్రభుత్వ విప్,జిల్లా టిఆర్ ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సామూహికంగా రణ దీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు,కార్మిక కుటుంబాలు ,కార్మికేతరులు, అన్ని వర్గాల ప్రతినిధులు తరలి వచ్చారు. సింగరేణి ని కాపాడుకునేందుకు టిఆర్ ఎస్ చేస్తున్న పోరాటానికి,దీక్షలో ఉన్న బాల్క సుమన్ కు సంఫీుభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చూపెట్టిన తెగువనే....సింగరేణి ని కాపాడుకునేందుకు చూపెడతామన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పై,బీజేపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని దెబ్బతీసే కుతంత్రం చేస్తోందన్నారు. యావత్ తెలంగాణకే కొంగుబంగారం లాంటి సింగరేణి ని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పజెప్పడంలో పెద్ద కుట్ర ఉందని....కొన్నాళ్ల తర్వాత కుంటి సాకులతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను కూడా ప్రైవేటు వారికి అమ్మడం ఖాయమన్నారు. తద్వారా తన దోస్తులైన కార్పోరేట్ శక్తులకు లబ్ది చేకూర్చేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని సుమన్ ఆరోపించారు. గనులను ప్రైవేటు పరం చేస్తే.. బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. కార్మికుల సెగ ఢల్లీికి తాకుతుందని హెచ్చరించారు. లాభాల బాటలో ఉన్న సింగరేణికి అవసరమైన బొగ్గు గనులు కేటాయించాల్సింది పోయి....ఇప్పటికే పెట్టు బడులు పెట్టిన సింగరేణి పరిధిలోని జేబీఆర్‌ఓసీ`3, కేకే`6, శ్రవనపల్లి ఓపెన్ కాస్ట్, కోయ గూడెం బ్లాక్ లన వేలానికి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గనులను వేలం వేయడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి నేరుగా బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి బిడ్డలు.. కార్మికులకు తాము అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరిగిందని, బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కూ ఐరన్‌ఓర్ గనులను ఇవ్వకుండా నష్టాల పాలు చేసిన కేంద్ర ప్రభుత్వం..దాన్ని ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపైనా అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పరం అయిన తరువాత వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని.... గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని ప్రయోజనాలు పోతాయని..చివరికి సింగరేణి సంస్థ కూడా కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.. సింగరేణిని కాపాడుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీ ఎంతటి పొరాటానికైనా సిద్ధంగా ఉందన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ఆగాలంటే తెలంగాణ బీజేపీ నేతలను ఊర్లలోకి రానివ్వకుండా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకుంటే....ఢల్లీి ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని బాల్క సుమన్ హెచ్చరించారు. దీక్షలో పెద్ద సంఖ్యలో టిఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు నేతలు, కార్మికులు, బిపణసబ నాయకులు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సందర్శించారు. సంఫీుభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష ను విరమింపజేశారు. దీక్ష కు మద్దతు తెలిపిన సబ్బండ వర్గాల ప్రజలకు జిల్లా పార్టీ తరపున విప్ బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.