ఇండియాకు కివీస్‌ షాక్‌

రెండో వన్డేలో అనూహ్య విజయం

క్వీన్స్‌టౌన్‌,ఫిబ్రవరి15(జనం సాక్షి): ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్‌ మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వీన్స్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియన్‌ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 270 రన్స్‌ చేసింది. మిథాలీ రాజ్‌, రిచా ఘోష్‌లో హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. మిథాలీ తన కెరీర్‌లో 61వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు మరో ఆరు బంతులు ఉండగానే టార్గెట్‌ను చేజ్‌ చేసింది. కివీస్‌ బ్యాటర్‌ అమేలియా కెర్‌ 119 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచింది. మిథాలీ 81 బంతుల్లో 66 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచింది. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ 64 బంతుల్లో 65 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ మేఘన ఏడు బౌండరీలతో 49 రన్స్‌ చేసింది. దీప్తి శర్మ నాలుగు వికెట్లు తీసుకున్నది. కానీ అమేలియా కెర్‌ నిలకడ సెంచరీతో ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 2`0 ఆధిక్యాన్ని సాధించింది.