గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు


తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

7నుంచి అసెంబ్లీ సామవేశాలు
అదేరోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌
విడుదలయ్యింది. మార్చి 6న బడ్జెట్‌ ఆమోదంపై తెలంగాణ కేబినెట్‌ భేటీ జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. మార్చి 7న ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. 2014, 1970లోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి.
మార్చి 7 ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, సుదీర్ఘంగా చర్చించి తేదీలను ఖరారు చేశారనిసమాచారం. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌ సమావేశాల తొలిదశ ముగిసాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్జడెట్‌ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022` 23 రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పద్దులు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఇతరత్రాలకు సంబంధించిన ప్రగతిపద్దు తయారీ శరవేగంగా సాగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఉద్యోగాల నియామకాలకు అవసరమైన మొత్తాన్ని నిర్వహణ పద్దులో సర్దుబాటు చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బ్జడెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాలి. ఆలోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి.. ఆలయ మహా కుంభ సంప్రోక్షణ ముహూర్తాన్ని మార్చి 28న ఖరారు చేశారు. ఆ ముహూర్తంలోగా బడ్జెట్‌ సమావేశాలు ముగించనున్నారు.