శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌

తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌ జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో బిశ్వ భూషణ్‌ హరిచందన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌, ఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ఎల్‌ఎసి ఛైర్మన్‌ దుష్యంత్‌ కుమార్‌, డెప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, లోకనాథం. భాస్కర్‌, తిరుపతి అదనపు ఎస్పీ సుప్రజ, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

15నుంచి సర్వదర్శనం టోకెన్లు: టిటిడి ఇవో వెల్లడి
 ఈ నెల 15వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో రోజుకు 10వేలు చొప్పున భక్తులకు కేటాయించనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు. 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉదయస్తమాన సేవా టిక్కెట్ల బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ యాప్‌ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో ఉదయస్తమాన సేవా టిక్కెట్టును సైతం బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిపై ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు.