చిన్నారికి ప్రాణం పోయండి

  


-  పుట్టుకతోనే అంగవైకల్యం ఆ బాలుడికి శాపం

-  ఏడు సంవత్సరాలుగా జీవచ్ఛవంలా మంచంలోనే

-  మెదడు ఎదుగుదల లేదని తేల్చిన వైద్యులు

-  వైద్య ఖర్చులతో ఆర్దికంగా కుంగిపోయిన కుటుంబం

-  ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లే స్థోమత లేక పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు

-  ఆపన్నహస్తం కోసం నిరీక్షణ

 
-  89 శాతం వైకల్యం వున్నా మూడు సంవత్సరాలుగా పించన్ కోసం ఎదురుచూపులు


కరకగుడెం, జనంసాక్షి (ఫిబ్రవరి 22) : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఇంటి యజమాని ట్రాక్టర్ డ్రైవర్ గా పనికి వెళితేనే నోటిలోకి ఐదు వేళ్ళు వెళ్ళే బీద పరిస్థితి. కుటుంబ పోషణే భారంగా మారిన ఆ కుటుంబానికి కొడుకు రూపంలో విధి వక్రీకరించడంతో వారి బ్రతుకే భారంగా మారింది. కూలో, నాలో చేసుకొని కొడుకులను ప్రయోజకులను చేస్తే రాబోవు రోజుల్లో బతుకులు మారతాయన్న తల్లిదండ్రుల ఆశలను ఆ దేవుడు తలకిందులు చేశాడు. ఆడి పాడే వయసులో కన్నకొడుకు మంచానికే పరిమితం కావడంతో ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆ తల్లదండ్రులది. ఏడు సంవత్సరాలుగా కొడుకు వైద్యానికి తండ్రి ఆర్థిక స్థోమతకు మించి లక్షల్లో అప్పులు చేసినా ఫలితం లేని రోగమది. కళ్ళెదురుగా అచేతనంగా పడివున్న బిడ్డతో దీనావస్థలో గడిపే తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. బిడ్డ కష్టం చూడలేక.. రెక్కల కష్టం సరిపోక.. ఆపన్న హస్తం కోసం నిరీక్షిస్తూ.. పరీక్షగా ఎదురుచూస్తున్న ఓ తల్లి దండ్రుల హృదయవిదారక సంఘటనపై జనంసాక్షి దినపత్రిక ప్రత్యేక కథనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగుడెం మండలం సీతారామ్ పురం కాలనీకి చెందిన కొమరం రామకృష్ణ, సరస్వతి దంపతులకి ముగ్గురు సంతానం. వీరిలో పెద్దకుమారుడు నాగదీపక్ కు ఏడు ఏళ్ళు. పుట్టుకతో అంగవైకల్యం ఆ కుటుంబ ఆనందాన్ని చిన్నాభిన్నం చేసింది. చిన్నప్పటి నుండి బ్రెయిన్ ఎదుగుదల సరిగా లేని కారణంగా నరాలకు రక్త ప్రసరణ లేక కాళ్ళు, చేతులు చచ్చుబడి ఏడు సంవత్సరాలుగా మంచంలోనే జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. ఏడు ఏళ్ళ నుండి కనీసం నోరారా అమ్మా అని పిలువలేని దయనీయ స్థితిలో వున్న కొడుకును చూసి ఆ తల్లి బోరున విలపిస్తుంది. అతనికి ఆకలి, దప్పికవుతుందని తల్లిదండ్రులకు చెప్పాడానికి నోటి మాట లేదు. సైగ చేసి చెప్పడానికి శరీర అవయవాలకు చలనమే లేదు. ఎవరినీ కళ్లతోటి గుర్తించలేడు. అమ్మ,నాన్న ఎవరు...? అసలు నేను ఎవరు అనే ఆలోచన లేని కడు బాధాకరమైన స్థితిలో నాగదీపక్ ఉన్నాడు. భద్రాచలం, కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షలు ఖర్చు చేసి చూపించినా ఫలితం లేదని, అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న అతను జీవితంలో లేచి తిరుగుతాడనే నమ్మకాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పినట్లు నాగదీపక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లి సరస్వతి ఏదో కూలి పనికి వెళ్ళి చేసిన అప్పులు తీర్చుకుందామన్నా బిడ్డకు ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని పుట్టినప్పటి నుండి చెంతనే వుంటూ కొడుకుకు సపరియలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది. ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ 4 లక్షలు అప్పు చేసి అందుబాటులో వున్న ఆసుపత్రులకు తిరిగినా ఆ రోగానికి ఫలితం లేకపోగా చేసిన అప్పులు తీర్చలేక బ్రతుకే కష్టంగా మారింది . మెరుగైన వైద్యం కోసం పెద్ద దావాఖనా లో చూపించడానికి ఆర్దికంగా ఇప్పటికే చితికిపోయిన ఆ తండ్రి దిక్కుతోచని పరిస్థితుల్లో నాగదీపక్ ను మంచానికే పరిమితం చెయ్యాల్సి వచ్చింది. పెద్ద ఆసుపత్రులకు తీసుకెళితే ఏమైనా ప్రయోజనం ఉంటుందనుకున్నా జేబులో చిల్లి గవ్వ లేక బిడ్డ పడే భాదను చూసి తట్టుకోలేక ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు.

-  89 శాతం అంగవైకల్యం వున్నా అందని పించన్

నాగదీపక్ చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆ తల్లిదండ్రులకు బ్రతుకే భారంగా మారింది. వచ్చే కూలి డబ్బులు అప్పులకే సరిపోకపోవడంతో మంచంలో చలనం లేకుండా పడివున్న కొడుకు ఆకలి తీర్చడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులలో జీవనం కొన సాగిస్తున్నారు. 2019 సంవత్సరం కొత్తగూడెంలో జరిగిన సదరన్ క్యాంపు లో నాగదీపక్ కు 89 శాతం అంగవైకల్యం వుందని వైద్యాధికారులు ధృవీకరించారు. పింఛను కోసం దరఖాస్తు చేసి మూడు ఏళ్ళు కావస్తున్నా పించన్ రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పించన్ వస్తే నైన నాగ దీపక్ కు సరైన ఆహారం అందించగలమని దీనంగా అర్ధిస్తున్నారు. అధికారులు స్పందించి కనీసం పించన్ అందేలా చూడాలని తల్లిదండ్రులు చేతులెత్తి వేడుకుంటున్నారు.