గౌతం రెడ్డి మృతి ప్రభుత్వానికి తీరని లోటు

బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు

నేటి జగనన్న తోడు మూడో విడత వాయిదా

అమరావతి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): గౌతం రెడ్డి మరణం ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి తీరని లోటని ఏపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి పెట్టుబడులు తీసుకురావాలని ఇటీవల దుబాయ్‌ వెళ్ళాడని, ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా ఆప్యాయంగా రీసివ్‌ చేసుకునే వ్యక్తిన్నారు. ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. బుధవారం రోజు నెల్లూరు తన సొంత గ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని, ప్రత్యేక హెలికాప్టర్‌ కోసం ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.  నెల్లూరుకు గౌతంరెడ్డి పార్ధివదేహాన్ని తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఇదిలావుంటే మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించతలపెట్టిన ’జగనన్న తోడు’ మూడవ విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28కి వాయిదా వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ, కమిషనర్‌ తుమ్మా విజయ్‌ కుమార్‌ రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించిందని, స్వర్గీయ మంత్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించ తలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గౌతమ్‌రెడ్డి పార్థివదేహం జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం ఉంచారు. అయితే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం నెల్లూరుకి ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకెళ్తారు. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచుతారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్‌, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు. గౌతమ్‌రెడ్డి 1971 నవంబర్‌ 2న జన్మించారు. గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ ఆయన ఎమ్మెస్సీ చేశారు. ఈయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేసిన గౌతమ్‌.. తొలిసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. మేకపాటికి కేబినెట్‌లో చోటిచ్చారు. ప్రస్తుతం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా గౌతమ్‌ ఉన్నారు.