.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ముచ్చింతల్‌


` రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి): సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని.. ముచ్చింతల్‌ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ముచ్చింతలో సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రామానుజుల స్వర్ణమూర్తి లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది. రామానుజుల స్వర్ణమూర్తి నెలకొల్పి చినజీయర్‌ స్వామి చరిత్ర సృష్టించారు. రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారు. ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారు. ప్రజల్లో భక్తి, సమానత కోసం కృషి చేశారు. రామానుజ సిద్ధాంతాలు జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో ఆయన చైతన్యం నింపారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం రామానుజాచార్యులు కృషి చేశారు. ఈశ్వరాధన చేయడానికి అన్ని వర్గాలకు హక్కు ఉంటుందని చెప్పారు. దైవ భక్తి ద్వారా ప్రజలకు ముక్తి లభిస్తుందని చాటి చెప్పారు. సాంస్కృతిక విలువల ఆధారంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. శ్రీరంగం, కాంచీపురం, వారణాశి నుంచి తన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేశారు’’ అని రాష్ట్రపతి అన్నారు. చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. సమతా సిద్ధాంతాలను రామానుజులు ప్రపంచవ్యాప్తం చేశారని, అన్ని వర్గాలు సమానమే అని చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో అసమానతలు రూపుమాపేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హయాంలో దేశ గౌరవం ఇనుమడిరచిందని చినజీయర్‌ స్వామి కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి.. సమతామూర్తి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.
రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేసిన రాష్ట్రపతి
సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు చినజీయర్‌ స్వామి స్వాగతం పలికారు. రామానాజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన రామానుజుల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకార్పణం చేశారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాలను రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్‌ స్వామి రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జూపల్లి రామేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.