తెలంగాణా మహా కుంభమేళా.......
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర..!
బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను,కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును,తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టపన.......
గురువారం సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి జనసంద్రం లో తెచ్చి ప్రతిష్టాపన.....
శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లింపు.....
శనివారం దేవతలు వనప్రవేశం....
ములుగు(మేడారం)ఫిబ్రవరి15(జనం సాక్షి):-
ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే ఈ జనజాతరకు కోటి కి పైబడి మంది వస్తారని అంచనా.ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దినొందింది. తాడ్వాయి మండలం లోని కీకారణ్యం గుండా సాగే దారిలో వున్న మేడారం లో ప్రతి రెండేళ్లకు ఒకేసారి మాఘశుద్ధ్య పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే ఈ అతిపెద్ద గిరిజన జాతరకు దాదాపు గా కోటి మంది కి పైబడి భక్తులు హాజరవుతారు. పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయం లో జరిగే ఈ జాతరలో సమ్మక్క,సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గాని, ప్రతిరూపాలుగాని వుండవు. మేడారం జాతర కాశీ పుష్కర మేళాలకు,పూరీ జగన్నాధ రథయాత్రకు,తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు భిన్నమైన రీతిలో జరుగుతుంది.ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ,బెల్లం(పగిడి-బంగారం) లాంటి వస్తువులతో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.తెలంగాణా కుంభమేళాగా పిలిచే ఈ మేడారం జాతరకు ఆంద్రప్రదేశ్,ఛత్తీస్ గడ్, ఒరిస్సా,మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్,జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు,గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు.ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరుగుతుంది.మొదటి రోజు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను,కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును,తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి జనసంద్రం తెచ్చి ప్రతిష్టిస్తారు.శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారంలో ఒకటే సందడి. సమ్మక్క,సారలమ్మ ఆగమనం, దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం,వన దేవతల పూజలు,వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. వెయ్యేళ్ల క్రితం స్వయం పాలన కోసం పోరాడిన వీర వనితలైన సమ్మక్క,సారలమ్మలకు నివాళి అర్పించే కార్యక్రమం కాలక్రమేణా జాతరగా మారింది.దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతం మేడారం ప్రాంతంలో మేడరాజులు కాకతీయులకు సామంతులుగా రాజ్యం చేస్తుండే వారు. మేడరాజ్యానికి సామంత రాజు పగిడిద్దరాజు,పగిడిద్దరాజు భార్య సమ్మక్క,వారి ముగ్గురి సంతానం సారలమ్మ, నాగులమ్మ,జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు, ఓసారి నాలుగేళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో మేడరాజ్యంలో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. దీంతో సామంతులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు.కప్పం చెల్లించడం లేదనే సాకుతో కాకతీయులు మేడరాజులపై యుద్ధానికి దిగారు.పగిడిద్దరాజు,జంపన్న, నాగులమ్మ,సారలమ్మ, గోవిందరాజు కాకతీయులు వీరోచిత పోరాటం చేశారు. అయినా శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధభూమిలో నేలకొరిగారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వాగు ఇప్పుడు జంపన్న వాగయ్యింది.భక్తులు పుణ్యస్నానాలు చేసే పవిత్ర స్థానమైంది.కుటుంబ సభ్యులంతా కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొరిగారని తెలుసుకున్న సమ్మక్క యుద్ద రంగంలోకి దిగింది.పరాశక్తి అవతారమెత్తింది.కాకతీయుల సైన్యాన్ని దైర్యంగా ఎదుర్కొంది. ఈటలు,బల్లాలతో కాకతీయుల సైన్యాన్ని చీల్చి చెండాడింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది.అప్పుడామే యుద్ధ భూమి నుంచి వైదొలగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది.అక్కడి నెమలిమినార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరణి మాత్రమే దొరికింది.ఎంత వెతికినా సమ్మక్క దొరకలేదు. ఆ కుంకుమ భరిణనే సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయడం అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితి.జంపన్న వాగులో స్నానాలు,తలనీలాల సమర్పణం,ఎదురు కోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం,లక్ష్మి దేవర వేశాలు, శివసత్తుల పూనకాలు,వడిబియ్యం సమర్పణ,బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం,మండ మెలిగే ఉత్సవం,కోయదొరల భవిష్యవాణి,మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట పాట లాంటి దృశ్యాలు జాతరను కోలాహలంగా మారుస్తాయి.వేద మంత్రోచ్ఛారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా,ఏ మతం ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు,వీరినే వడ్డెలు అని స్థానికంగా పిలుస్తారు.కోయ గిరిజన పద్దతిలో ఈ జాతర జరుగుతుంది.ఈ మహా జాతరకు తెలంగాణ,ఆంధ్రా ప్రాంతాల నుంచి,ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ అయిన మేడారం జారతను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా పరిగణించి విస్తృత ఏర్పాట్లు చేసింది.తాడ్వాయి మండలాన్ని సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంగా నామకరణం చేశారు.ఈ సారి భక్తుల కోసం పదివేల తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతమున్న స్నానఘట్టాలకు తోడుగా అదనపు స్నానఘట్టాలను నిర్మించారు.బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ సంఖ్యను కూడా పెంచారు.మూడు కోట్ల రూపాయలతో గిరిజన మ్యూజియం నిర్మించారు. సమ్మక్క కొలువై ఉండే చిలుకల గుట్ట పరిరక్షణ కోసం చుట్టూ ప్రహరీ గోడ,ముళ్ల కంచె నిర్మించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు 4 వేల బస్సులు నడుపుతోంది. జాతర సందర్భంగా సూపర్ స్పెషాలిటీతో వంద పడకల ఆసుపత్రి నిర్వహిస్తారు.నాలుగు వేల మంది కి పై బడి పారిశుద్ధ్య కార్మికులు జాతర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ప్రపంచం నలుమూలలు జాతర విశేషాలు అందించడానికి మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.ప్రత్యేకం గా 300 సిసి కెమెరాల ద్వారా జాతరను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.శాంతి భద్రతల పరిరక్షణకు క్యూ లైన్లలో... తొక్కిసలాట నిరోధానికి,ట్రాఫిక్ నియంత్రణకు దాదాపు పది వేల మంది పోలీసులు శ్రమిస్తారు.యుద్ధ భూమిలో నేలకొరిగిన తమ జాతి బిడ్డలకు నివాళి అర్పించడానికి కోయ గిరిజనులు ప్రతీ రెండేళ్లకోసారి మేడారానికి వచ్చి తమదైన సాంప్రదాయం ప్రకారం పూజలు చేసే వారు. ప్రత్యేకంగా జరిగే ఈ పూజా విధానం అందరినీ ఆకర్షించింది. అందరూ అదే పద్ధతిని అనుసరించారు. కోయ గిరిజన జాతర ఇప్పుడు అందరిదైంది. ఇప్పుడు కోయ గిరిజనులే కాదు.ఇతర మతస్తులు కూడా కోయ సాంప్రదాయం ప్రకారమే జాతరలో దేవతలను మొక్కుకుంటారు.గుడి మెలగడం,వనం నిర్వహించడం దగ్గర సంచి దేవతలను గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించడం,మళ్ళీ వనప్రవేశం చేయించడం వరకు అన్నీ కోయ సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయి.అధికారులు ప్రభుత్వ ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలుపంచుకోరు.అంతా కోయ పూజారులే చేస్తారు.జాతర ఆదాయంలో కూడా కోయపూజారులకే మూడో వంతు వాటా ఉంటుంది.
తెలంగాణ,ఆంధ్ర ప్రాంతాలతో పాటు,మహారాష్ట్ర నుంచి గోండులు,కోయలు,లంబాడా మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా జారతకు పెద్ద ఎత్తున తరలివస్తారు.దాదాపు కోటి మందికి పైగా ఈ జాతరకు హాజరవుతారు.మతాలు వేరైనా,దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా సరే జాతరలు సహజంగా జరిగేవే.. కానీ ఏ జారతకూ లేని ప్రత్యేకతలు,అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే సెలయేటిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణమోగే గంటలు మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ప్రత్యక్షమవుతుంది. యుద్ధభూమిలో నేలకొరిగిన జాతి రత్నానికి భక్తకోటి నివాళులు మేడారంలో అర్పించే మరో జకార్తా, దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం. ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు.పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు దేవతలయ్యారు.చరిత్ర చెప్పితే అయిపోయేది కాదు.మహాతల్లుల దర్శనంతో ప్రతి ఇంటా పుణ్యం నోచుకుంటోంది.