కెసిఆర్ ప్రయత్నాలకు విపక్ష నేతల సహకారం
తెలంగాణ సమస్యలపై ముందు దృష్టి సారిస్తేనే విజయం
పికె సలహాలు ఎల్లవేళలా విజయ ప్రణాళికలు కాకపోవచ్చు
హైదరాబాద్,ఫిబ్రవరి21): రాజకీయాల్లో ఇంట గెలిచి రచ్చ గెలవాలి. తెలంగాణలో కెసిఆర్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా..వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేగాదు..లెక్క చేయడంలేదు. నిరుద్యోగుల ఆందోళనలు..ఉద్యోగాల బదిలీలు..విద్యుత్ డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో బాదుడు... అలాగే రాజకీయ అణచివేతలు కూడా తీవ్రంగ ఆఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించిన వారిని నిర్బందాలు, కేసులతో వేధిస్తున్నారు. కానీ కెసిఆర్ దృష్టి ఇప్పుడు జాతీయరాజకీయాలపై పడిరది. మంచిదే..మోడీ అక్రమాలను ఎదుర్కోవాల్సిందే..ప్రజలా వ్యతిరేక చర్యలను అడ్డుకోవాల్సిందే. కానీ ఇక్కడ జరుగుతన్న తీరు పక్కన పెట్టి..తన పాలనే భేషుగ్గా ఉందిన చెప్పుకోవడమే ఆత్మవంచన తప్ప మరోటికాదు. రాష్ట్రంలో అధికారం చేజారకుండా, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్‌గా భావించాలి.క్షేత్రస్థాయిలో కెసిఆర్‌కు ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని మొగ్గలోనే తుంచుకుని ముందుకు సాగాల్సి ఉంది. సమస్యలనుపరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయడంతోనే కేసీఆర్ బిజెపిపై యుద్దం ప్రకటించారు. ధాన్య సేకరణలో కేంద్ర వైఖరిని తప్పు పడుతూ ఆందోళనలకు దిగారు. ఇప్పుడు నేరుగా బిజెపిని ఢీకొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పోల్చితే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో కేవలం 9స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించడానికి ఇతరులు అంగీకరించే అవకాశం ఉంటుందా అన్నదే అనుమానం.ప్రత్యామ్నాయ వేదికకు వేసిన అడుగులో భాగంగా మహారాష్ట్ర వెళ్లి సిఎం ఉద్దవ్ థాక్రేను, శరద్‌పవార్‌ను కలిసారు. అయితే కప్పల తక్కెడ లాంటి విపక్షాలు ఐక్యం అవుతాయా అన్నదే అనుమానం. ఎందుకంటే కాలం కలసి వస్తే ప్రధానమంత్రి కావాలని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ విజయం సాధిస్తే అతి పెద్ద రాష్టాన్రికి చెందిన తన సంగతేమిటని ముందు నిలిచే అవకాశం ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎప్పటినుంచో ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. మోడీకన్నా తానే సమర్థనేత అని గతంలోనే ప్రకటించుకున్నారు. కేసీఆర్ ప్రకటనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయన్నది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాతగానీ స్పష్టం కాదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కేసీఆర్ వేగం పెంచుతారు. ఆయనతో కలసి వచ్చే వారి సంఖ్య కూడా పెరగవచ్చు. అక్కడ మళ్లీ బీజేపీ గెలిస్తే ఇప్పుడు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిలో కొందరు సైలెంట్ అయిపోవడం ఖాయం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వచ్చినందున ఎవరితో పోరాడినా ఆమెకు పోయేదేవిూ లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నందున ఆమెకు పోరుబాట తప్పదు. కేసీఆర్ పరిస్థితి అలా కాదు. మరో ఏడాదిన్నర తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్లవలసి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవడంతో తొలి అడుగు వేశారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే అడుగులు వేస్తున్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వేగంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ముక్త్
భారత్’ అని కేసీఆర్ తాజాగా పిలుపిచ్చారు. ఈక్రమంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాకరే, స్టాలిన్ వంటి వారు మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టబోయే ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్‌కు ఉన్నాయని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ప్రముఖులు అప్పుడే ప్రచారం మొదలెట్టారు.
నిజానికి కేసీఆర్ ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంతో స్నేహ సంబంధాలతోనే సాగారు. అయితే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో కేసీఆర్ జాగ్రత్తపడే లక్ష్యంతో బిజెపి వ్యతిరేకతను గట్టిగా ముందుకు తీసుకుని వెళుతున్నారు. గతంలో కూడా ఇలాగే చెప్పి ఆ తర్వాత కేసీఆర్ వెనక్కి తగ్గడంతో చాలామంది కెసిఆర్‌ను సీరియస్‌గా తీసుకోక పోవచ్చు. అయితే, ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించడం కూడా మొదలుపెట్టాక కేసీఆర్‌పై ఇతర పార్టీల నాయకులకు నమ్మకం కుదిరిన ట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర లేకుండా బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు సాధ్యం కాదని పికె కూడా సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందుకే రాహుల్‌ను తిట్టిన అసోం సిఎంపై కెసిఆర్ విమర్శలు గుప్పించారు. ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తన పార్టీని ఇతర రాష్టాల్ల్రో విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో విజయంతమదే అన్న భావనలో ఉన్నందున కేసీఆర్ పిలుపునకు ఇంతవరకు స్పందించలేదు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తటస్థంగా ఉండటానికే ఇష్టపడతారు. కమ్యూనిస్టుల కెసిఆర్‌కు మద్దతుగా ఉన్నా ఆయన నిర్ణయాలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుగానీ ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమితో జట్టుకట్టే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మొదలెట్టిన ప్రత్యామ్నాయ ప్రయత్నం విజయవంతం అవుతుందా అన్నదే ప్రశ్న.