దళితులను నమ్మించి ద్రోహం చేశారు

 

దళితులకు విదేశీ విద్యానిధుల నిలిపివేత
దళితులు మౌనం వీడి పోరాడాలన్న టిడిపి
దళితులపై కేసులు పెడుతూ వేధింపులు
మండిపడ్డ మాజీ ఎంపి హర్షకుమార్‌
రాజమండ్రి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దళితులను నమ్మించి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీ బడ్జెట్‌లో దళితుల కోసం కేటాయించిన నిధులను జగన్‌ దారిమళ్లిస్తున్నారని చెప్పారు. దళితుల విదేశీ విద్యకు నిధులు నిలిపివేయటం వల్ల విదేశాల్లో దళిత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన దళిత ప్రతిఘటన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులు ఇప్పటికైనా మౌనం వీడి ముఖ్యమంత్రి జగన్‌ను నిలదీయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలోని దళితులంతా ప్రభుత్వంపై తిరగబడాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పిలపునిచ్చారు. విూడియాతో ఆమె మాట్లాడుతూ జగన్‌ దళితుల ద్రోహిగా మారారన్నారు. దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా జగన్‌ స్పందించటం లేదని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో దళితుల ద్రోహి జగన్‌ను ఓడిరచాలని ఆమె అన్నారు. దళిత సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నామని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. శతుని రైల్‌ కేసులు ఎత్తేయాలని ప్రభుత్వంపై పోరాడితే ఆ కేసులు తొలగించారన్నారు. అలాగే దళిత యువత పైన ఉన్న కేసులను ఎందుకు ఎత్తేయడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి చెప్పిన తర్వాత కూడా శిరోముండనం కేస్‌ పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదని సీఎం జగన్‌ని హర్షకుమార్‌ ప్రశ్నించారు. తనను 48 రోజులు జైల్‌లో పెట్టారన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్య టీడీపీ ప్రభుత్వంలో అమలయిందన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న పిల్లలకు విదేశీ విద్యకు ఇచ్చే ఫీజులు ఇవ్వకపోతే వారికి సర్టిఫికెట్‌ ఇవ్వరన్నారు. సర్టిఫికెట్లు లేకుండా ఏపీ విద్యార్థులు ఇక్కడకు రాలేరన్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులు చనిపోతే జగన్‌ సమాధానం చెప్పాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఏపీ ఏస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు
అన్నారు. బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పులివెందులలో జగన్‌ ఇంటికి సవిూపంలోనే దళిత మహిళపై అత్యాచారం జరిగినా పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు 20 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి జగన్‌ దళితులకు చెందిన 11 వేల ఎకరాల భూములను లాక్కున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్యానుకు ఓటివేసిన వాళ్లు అదే ప్యానుకు ఉరివేసుకుంటున్నారన్నారు. ఎస్సీ నిదులు దారిమళ్లుతున్న మంత్రి విశ్వరూప్‌ మాట్లాడకపోవటం దుర్మార్గమని చెప్పారు. రాజమండ్రిలో దళిత మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ప్రశ్నించలేని స్థితిలో మంత్రి తానేటి వనిత ఉన్నారని మండిపడ్డారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును కన్నీరుపెట్టించిన వారిని లోకేశ్‌ రక్తకన్నీరు పెట్టిస్తారని ఎంఎస్‌ రాజు చెప్పారు.