పాలకుర్తిలో శివరాత్రి వేడుకలకు సన్నద్దం

ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి సవిూక్ష

జనగాం,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాలు పక్కాగా నిర్వహించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరపై సంబంధిత, వివిధ శాఖల అధికారులతో పాలకుర్తిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సవిూక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా పాలకుర్తికి పేరుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా శంకరుడు, విష్ణువు వేర్వేరుగా స్వయంభువులుగా వెలసిన క్షేత్రం లేదు. ఇలాంటి క్షేత్రం వల్ల, తొలి తెలుగు కవి, ఇక్కడి పాల్కురికి సోమనాథ కవి వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరు గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం ఎంతో చరిత్రాత్మకం. ప్రతి ఏటా మహా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ సారి కూడా ఘనంగా జాతర ఏర్పాట్లు పక్కాగా జరగాలి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు . టూరిజం కింద పాలకుర్తి దేవాలయానికి రూ. 15 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. దేవాలయ మంటపానికి గ్రానైట్‌ వేస్తున్నారు.
గిరి ప్రదక్షిణ రోడ్లకు లైట్స్‌ పెట్టాలి. మసీదు దగ్గర రోడ్డుకు సీసీ వేయాలి. జనగామ, వరంగల్‌, తొర్రూరు, సూర్యాపేట ఇతర రహదారుల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. రోడ్లకు ఇరువైపులా మట్టి పోసి బాగు చేయాలి. మిషన్‌ భగీరథ ద్వారా 24 గంటలపాటు మంచినీరు, ఆరోగ్య శిబిరాలు, పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనుభవం ఉన్న అధికారుల సేవలను జాతరకు అధికారులు వినియోగించు కోవాలని సూచించారు. రామచంద్రయ్య శర్మ అధ్వర్యంలో తాత్కాలిక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ జాతర వరకు పని చేస్తుంది. భక్తుల సదుపాయాల విషయంలో రాజీ పడొడ్డు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు, జాతర నిర్వహణ ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శివ లింగయ్య, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.