సంపూర్ణ అక్షరాస్యతకు గండి

కరోనాతో ఆగిపోయిన ప్రచారం

జగిత్యాల,ఫిబ్రవరి4(జనంసాక్షి): జగిత్యాల జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతగా మార్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. ’ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వడంతో అందుకు తగినట్లుగా జగిత్యాల జిల్లాలో అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే రెండేళ్లుగా కరోనాతో బయటకు వెళ్లి ప్రచారం చేయలేని దుస్థితి ఏర్పడిరది. జిల్లావ్యాప్తంగా 77,836 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునివ్వగా జిల్లాలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ వ్వయహారం మరుగన పడిరది. జగిత్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా, మొత్తం 380 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలతో పాటు మహిళా స్వ శక్తి సంఘాల సహకారంతో జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషుల్లో అక్షరాస్యత శాతం 70.31, స్త్రీలలో 50.66 శాతం ఉంది. ఈ లెక్కన పురుషుల అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండగా, మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. జిల్లాలో అక్షరాస్యత ఎక్కువ కలిగిన మండలంగా 77.53 శాతంతో జగిత్యాల మండలం గుర్తింపు పొందింది. ఇక్కడ పురుషుల అక్షరాస్యత శాతం 85.84 శాతం మేరకు ఉండగా, స్త్రీల అక్షరాస్యత శాతం 69.32గా ఉంది. జగిత్యాల జిల్లాలో సాక్షరభారత్‌ కార్యక్రమం వల్ల కొంత మేరకు అక్షరాస్యత పెరిగింది. కరోనా రాకుండా ఉండివుంటే మరికొద్ది మాసాల పాటు నిర్వహించినట్లయితే జగిత్యాల జిల్లా సంపూర్ణ అక్షరాస్యతగా మారే అవకాశాలు ఉండేవి.